న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశవ్యాప్తంగా ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు సమకూర్చడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)తో జతకట్టింది ద్విచక్ర వాహన విక్రయాల సంస్థ హీరో మోటోకార్ప్. బీపీసీఎల్‌కు చెందిన 7 వేల బంకుల్లో ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు సంస్థల మధ్య కుదిరిన అధికారిక ఒప్పందంలో భాగంగా జాతీయ రహదారుల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నారు. తొలి విడుతలో భాగంగా ఢిల్లీ, బెంగళూరులతోపాటు మరో ఏడు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నది.