తెలుగు సినీ పరిశ్రమలో ఓ సినిమాలో బడ్జెట్లో అత్యధిక భాగం హీరో, దర్శకుడికి పారితోషికమే అని చెప్పొచ్చు. ఓ సినిమా నిర్మాణానికి ఖర్చయ్యే బడ్జెట్లో యాభై శాతం వరకు రెమ్యూనరేషన్స్ రూపంలోనే వెళ్లిపోతాయి. అయితే ఒకటి రెండు సినిమాలు చేసిన యువ హీరోలు కూడా కోట్లలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మాస్ యువ హీరోగా పేరున్న ఓ కథానాయకుడు తాజాగా తన పారితోషికంగా ఏకంగా ఏడు కోట్ల రూపాయాలు డిమాండ్ చేస్తున్నాడట. సినిమా ప్రచారంలో భాగంగా మోస్ట్ అగ్రెసివ్‌గా మాట్లాడటం, సినిమా పబ్లిసిటీలో రెండు మూడు వివాదాల్లో ఇరుక్కున్న ఈ యువహీరో ఇటీవల ఏ చిన్న సినిమా ఫంక్షన్ జరిగినా వాళ్లకు సపోర్ట్ చేయడానికి కూడా వస్తున్నాడు. ఇలాంటి రెండు మూడు ఈవెంట్స్‌లో అతను ఒకే రోజు కూడా పాల్గొన్న రోజులు కూడా వున్నాయి.
కాగా అతని కెరీర్లో ఇప్పటి వరకు ఒకటి రెండు మినహా హిట్స్ లేవు. ఇటీవల వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్నాడు. అయినా సరే నా పాపులారిటీ పెరిగింది..కావున నా పారితోషికాన్ని కూడా పెంచుతున్నాను అంటున్నాడట. అయితే మీడియాలో వున్న పాపులారిటీకి, సినిమా కలెక్షన్లకు అసలు సంబంధమే వుండదని తెలిసినా తన కొత్త సినిమాల నిర్మాతలకు మాత్రం కొత్త పారితోషికాన్ని పే చేయాల్సిందేనని చెబుతున్నాడట.
ఇంతకు ముందు మూడు కోట్లు తీసుకునే హీరోగా ఏకంగా ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే సరికి నిర్మాతలు షాక్ అవుతున్నారు. మీ పాపులారిటీ సరే అండి.. మీ సినిమాలకు కలెక్షన్లు కూడా వుండాలి కదా.. అసలే ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గించారు. పెద్ద హీరోల సినిమాలకు మినహా థియేటర్స్‌కు కదలటం లేదు. ఒక వేళ సినిమా అద్భుతంగా వున్నా.. వసూళ్లు కూడా వీకెండ్ వరకే పరిమితం అవుతున్నాయి. .. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సదరు హీరో నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారట.