Hema Malini | భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన అరుదైన దృశ్యాలను ప్రదర్శించే ‘లెన్స్ అండ్ లెగసీ: బాలీవుడ్ ఇన్ ఫోకస్’ ఎగ్జిబిషన్ ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దివంగత నటుడు ధర్మేంద్ర, గాన కోకిల ఆశా భోంస్లేలకు నివాళిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘ట్రిబ్యూట్ వాల్స్’ అందరినీ ఆకట్టుకున్నాయి. వారి సినీ ప్రయాణానికి సంబంధించిన అరుదైన ఫోటోలు, జ్ఞాపకాలు సందర్శకులను భావోద్వేగానికి గురి చేశాయి.
వేదికపై మాట్లాడిన హేమ మాలిని తన భర్త ధర్మేంద్రను స్మరించుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది. ఆయన ఇక లేరనే నిజాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నానుఅంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన జీవితాన్ని ఆయన లేకుండా ఎలా గడపాలో అర్థం కావడం లేదని కూడా తెలిపారు.ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ, ఆయన కేవలం గొప్ప నటుడే కాకుండా, కెమెరా వెనుక కూడా ఎంతో కష్టపడి పనిచేసేవారని హేమ మాలిని కొనియాడారు. సినిమా అనేది హృదయాలను కలిపే వారధి అని ఆయన తరచూ చెప్పేవారని గుర్తుచేశారు.
బాలీవుడ్లో ‘హీ-మ్యాన్’గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర, యాక్షన్, కామెడీ, భావోద్వేగ పాత్రల్లో సమానంగా రాణించిన నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన నటన శైలి అద్వితీయమని హేమ మాలిని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో గాన కోకిల ఆశా భోంస్లేను కూడా స్మరించారు. తన సినీ కెరీర్లో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే గాత్రాలు తన పాత్రలకు ప్రాణం పోశాయని హేమ తెలిపారు. “అద్భుతమైన గాయనిని మనం కోల్పోయాం. ఆమె గాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది” అని అన్నారు.ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ ఫోటో జర్నలిస్టులు ప్రదీప్ చంద్ర, శాంతను దాస్ తీసిన అరుదైన ఛాయాచిత్రాలు ప్రదర్శించబడ్డాయి. కార్యక్రమానికి వెటరన్ నటుడు రంజిత్, పూనమ్ సిన్హా, మధు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తదితరులు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.