వాషింగ్టన్: అమెరికాలోని జేపీ మోర్గన్ ఛేజ్ కంపెనీ ఉద్యోగి ఒకరు ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హజ్దినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలు చేసిన వ్యక్తిని చిరాయు రాణా(Chirayu Rana)గా గుర్తించారు. దీనిపై న్యూయార్క్ పోస్టు ఓ కథనాన్ని రాసింది. జాన్ డోయి అనే గుర్తు తెలియని వ్యక్తి పేరుతో తొలుత ఫిర్యాదు నమోదు చేశాడు. కానీ ఆ వ్యక్తిని గుర్తించినట్లు తెలిసింది. లోర్నా హజ్దిని తనను లైంగికంగా వేధించిందని, జాతివివక్ష వేధింపులకు పాల్పడిందని, పనిప్రదేశంలో కూడా బెదిరింపులకు పాల్పడినట్లు చిరాయు రాణా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ జేపీ మోర్గన్ కంపెనీ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో ఆధారాలను కనుగొనలేకపోయారు.
చిరాయు రాణా వయసు 35 ఏళ్లు. న్యూయార్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్రీగల్ సేజ్మౌంట్లో ప్రిన్సిపాల్‌గా చేస్తున్నాడు. సాఫ్ట్వేర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్ ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఆ కంపెనీ సేవలు అందిస్తోంది. జేపీ మోర్గన్ ఫైనాన్స్ టీమ్‌లో రాణా, హజ్దిని కలిసి పనిచేశారు. కానీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రాండన్ గ్రాఫియోకు హజ్దిని రిపోర్ట్ చేసేది. మేనేజింగ్ డైరెక్టర్ జాన్ వోల్టర్కు రాణా రిపోర్ట్ చేసేవాడు. అయితే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రకారం రాణాపై ఆధిపత్యం ప్రదర్శించే పరిస్థితి హజ్దినికి లేదని తెలుస్తోంది. గతంలో రాణా పలు కంపెనీల్లో చేశాడు. హౌలిహన్ లాకే, క్రెడిట్ సూయిజ్, మోర్గన్ స్టాన్లే, ది కార్లే గ్రూపు కంపెనీల్లో చేసేవాడు. రట్జెర్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కూడా.
రాణా తన కోర్టు ఫిర్యాదులో.. హజ్దిని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించాడు. రోఫినాల్, వయగ్రా లాంటి డ్రగ్స్ తనకు ఇచ్చినట్లు చెప్పాడతను. ఒకవేళ లొంగిపోకుంటే ఉద్యోగం ఊడిపోతుందని బెదిరించారన్నాడు. అపార్ట్మెంట్లో మరో ఎగ్జిక్యూటివ్ కూడా వచ్చి శృంగారం చేయాలని తనను బెదిరించినట్లు రాణా తన లాసూట్లో పేర్కొన్నాడు. కోర్టు ఫైలింగ్‌కు చెందిన వివరాలను డెయిలీ మెయిల్ పత్రిక బయటపెట్టడంతో ఈ కేసులో ప్రజా ఆసక్తి పెరిగింది. కానీ హజ్దిని మాత్రం బలంగా ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. తమ క్లయింట్ అసహజంగా ప్రవర్తించలేదని హజ్దిని లీగల్ బృందం వాదించింది. అయితే జాతివివక్ష కామెంట్లు వివాదాస్పదం కావడంతో ఈ కేసుకు ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రస్తుతం రాణా లీవ్‌పై ఉన్నాడు. కానీ ఈ కేసులో రెండు వర్గాలు ఏమాత్రం తగ్గడం లేదు.