Elon Musk : ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్ సీఈవో (Delta Airlines) ఎడ్ బాస్టియన్ (Ed Bastian), టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తమ విమానాల్లో వైఫై సేవల కోసం మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ (Starlink) ను కాదని, అమెజాన్ (Amazan) కు చెందిన ‘లియో’ శాటిలైట్ వ్యవస్థను ఎడ్ బాస్టియన్ ఎంచుకోవడంపై మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు డెల్టా సీఈవో ఎడ్ బాస్టియన్ తన ఉద్యోగాన్ని కోల్పోతారని హెచ్చరించారు.
ఈ హెచ్చరికలు ఇప్పుడు సంచలనంగా మారాయి. డెల్టా సీఈవో ఎడ్ బాస్టియన్.. ఎలాన్ మస్క్ ప్రతిష్టపై చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఒక కంపెనీ కార్యక్రమంలో ఉద్యోగులతో కలిసి మాట్లాడుతూ.. మస్క్‌తో కలిసి పనిచేయడానికి తాము ఇష్టపడటంలేదని ఎడ్ బాస్టియన్ అన్నట్లు ఏవియేషన్ రిపోర్టర్ ఒకరు వెల్లడించారు. ‘మస్క్ ప్రతిష్ఠ గురించి మీకు తెలిస్తే ఆయన గురించి బయట చెప్పేవన్నీ నిజాలే’ అని ఎడ్ బాస్టియన్ వ్యాఖ్యానించినట్లు ఆ రిపోర్ట్ పేర్కొన్నది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మస్క్ దృష్టికి వెళ్లాయి. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఎడ్ బాస్టియన్ తన నిర్ణయంవల్ల తన ఉద్యోగాన్ని కోల్పోతారని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా డెల్టా కనెక్టివిటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్టార్‌లింక్ కనెక్టివిటీ లేనందున ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేయాలంటే దాన్ని డెల్టా విమానంలో ఉంచడమే సరైన మార్గమన్నారు.
ఈ నిర్ణయంవల్ల డెల్టా గణనీయమైన సంఖ్యలో కస్టమర్లను కోల్పోవచ్చని ఆయన గతంలోనే హెచ్చరించారు. గత మార్చి నెలలో డెల్టా ఎయిర్‌లైన్స్, అమెజాన్‌తో బహుళ-సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 2028 నుంచి దశలవారీగా 500 విమానాల్లో అమెజాన్ ‘లియో’ శాటిలైట్ ఆధారిత వైఫై సేవలను ప్రారంభించనుంది. అయితే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి అనేక ప్రత్యర్థి సంస్థలు ఇప్పటికే తమ విమానాల్లో వేగవంతమైన స్టార్‌లింక్ సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.