Honeycreeper | న్యూఢిల్లీ: ముదురు రంగులతో ఆకర్షణీయంగా ఉండి హవాయి దీవుల్లో ఎంతో సందడి చేసే హనీక్రీపర్ పక్షులు కనుమరుగైపోతున్నాయి. దోమల ద్వారా సంక్రమిస్తున్న ఏవియన్ మలేరియా వ్యాధి బారినపడి మరణిస్తున్నాయి. దీంతో ఇప్పటికే 33 జాతుల హనీక్రీపర్ పక్షులు అంతరించిపోవడంతోపాటు మరికొన్ని జాతులకు ముప్పు పొంచి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో హనీక్రీపర్ పక్షులను కాపాడేందుకు అధికారులు చివరి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సంతానోత్పత్తిని నిరోధించే ‘ఓల్బాచియా’ అనే సహజసిద్ధమైన బ్యాక్టీరియాను కలిగి ఉండే మగ దోమలను హెలికాప్టర్ల ద్వారా విడుదల చేస్తున్నారు. వీటితో జతకట్టిన ఆడ దోమలు గుడ్లను పొదగలేవని అధికారులు తెలిపారు.