నిజామాబాద్ : కామారెడ్డి -మెదక్ జిల్లా సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు(Pocharam project ) పొంగిపొర్లుతున్నది. నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నది. వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పోచారం నుంచి దిగువకు వెళ్తున్న వరద నీరు నేరుగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకోనుంది. కాగా, తెలంగాణలో గతవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఇప్పటికే వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.