న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నీట్ కౌన్సెలింగ్లో స్థానికతకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. మెడికల్ అడ్మిషన్లకు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివినవారిని లేదా స్థానికంగా ఉన్నవారినే స్థానికులుగా పరిగణిస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంపై కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై ఈ నెల 11న సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు అంగీకరించింది. దీంతో ఆ 135 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించడంతోపాటు హైకోర్టు తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది.
ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులను వెలువరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చండ్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం మరోసారి ఈ అంశంపై విచారణ చేపట్టడంతో.. హైకోర్టులో కేసు వేసిన 135 మంది విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్కు వీలు కల్పించడం అన్యాయమని, దీని వల్ల తెలంగాణ స్థానికతతో మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఇతర విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ప్రతివాదులు తెలిపారు. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను విద్యార్థులందరికీ వర్తింపజేయాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులను సవరించాలంటే ఆనాటి ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు విచారణ జరపాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఆ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ జేబీ పార్థీవాలా ప్రస్తుతం అందుబాటులో లేనందున ఈ అంశంపై ఈ నెల 30న విచారణ చేపడతామని ప్రకటించింది.