ఏ విషయంలోనైనా ‘హద్దులు’ పెట్టుకోవడం మంచిదే!ఎదుటివారికి ‘నో’ చెప్పడం, కాస్త సమయం లేదాఏకాంతం కోరడం, మీరు వేటిని సహించగలరో.. సహించలేరో నిర్ణయించుకునే హక్కు మీకుంది. నిజానికి ఇది ఎంతో ఆరోగ్యకరమైన, పరిణతితోకూడిన విషయం. కానీ ‘హద్దు’ అనేది.. కొన్నిసార్లు అసౌకర్యాన్ని ఎదుర్కోవడం ఇష్టంలేక వాడే ఓ సాధారణ ‘పదం’గా మారిపోతుంది. అయితే, మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి, ప్రతి కష్టమైన సంభాషణనూ దాటవేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ సూక్ష్మమైన తేడాను గుర్తించాలంటే.. ఈ ఐదు విషయాలను మనసులో పెట్టుకోవాల్సిందే!
మీకంటూ ఒక స్వతంత్ర జీవితం ఉంటుంది. కాబట్టి, మీకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎదుటివారు అధికారం చెలాయించాల్సిన అవసరం లేదు. అయితే, ఆపదలో ఉన్నప్పుడు సహాయం అడగక పోయినా, బాధలో ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడకపోయినా.. అది స్వతంత్రత అనిపించుకోదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేసుకున్న రక్షణ కవచం మాత్రమే.
కోపంలో ఉన్నప్పుడు కొందరు మాట్లాడకుండా ఉంటారు. వాదన నుంచి కాసేపు విరామం తీసుకుంటారు. ఇది మంచి విషయమే! కానీ, అసలు ఆ చర్చ గురించి మాట్లాడటానికే నిరాకరించడం సరైనది కాదు. ప్రశాంతంగా ఉండటానికి కొంత సమయం తీసుకోవడం మంచిదే! అంతేకానీ, రోజుల తరబడి మౌనంగా ఉండటం.. తప్పించుకోవడమే అవుతుంది.
కొందరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. మరికొందరు భావోద్వేగాలను అసలే పట్టించుకోలేరు. అయితే, ప్రతి సందర్భంలోనూ భావోద్వేగాలను సాకుగా చూపడం పద్ధతి కాదు. ఎందుకంటే, భావోద్వేగాల పట్ల అసౌకర్యంగా ఉండటం వేరు, వాటి చుట్టూ హద్దులు గీసుకోవడం వేరు.
మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుకునే హక్కు మీకు ఉంటుంది. అందుకే, కొన్ని విషయాల్లో ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయాన్నీ ఎదుటివారితో పంచుకోవాల్సిన పనీలేదు. కానీ, దగ్గరి సంబంధాల్లో మాత్రం ఈ నియమం వర్తించదు. కీలక విషయాల్లోనూ సొంతవారి దగ్గర మౌనంగా ఉంటే.. అది వారిని అవమానించినట్టే!
మనశ్శాంతి కోసం కొందరిని దూరం పెట్టడం సరైనదే! కానీ, ప్రతి అభిప్రాయభేదాన్నీ నెగెటివ్ కోణంలో చూడటం సరికాదు. ఎవరైనా మీకు బాధ కలిగిస్తే.. అసలు తప్పు ఎక్కడ జరిగిందో స్పష్టంగా గుర్తించి, పరిష్కరించుకోవాలి. అంతేకానీ, ప్రతి విషయంలోనూ వారిని పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదు. అలా చేస్తే.. మీరు మనశ్శాంతిని కాపాడుకోవడం లేదు. సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేక తప్పించుకుంటున్నారని అర్థం.