అతనికి కల వరం.. ఆమెకు కలవరం!
కలలో వచ్చిన ఒక విషయం కారణంగా మీ భాగస్వామి ఎప్పుడైనా మీపై అలిగారా? ఈ మధ్య ఒక మహిళ ఏకంగా కన్నీళ్లే పెట్టుకున్న ఘటన ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది. తన భర్తకు కలలో సూల్ ఫ్రెండ్ కనిపించడమే ఆమె ఆవేదనకు కారణమైంది. భర్తకు అది కేవలం ఒక కల మాత్రమే అయినప్పటికీ, భార్య మాత్రం దాని గురించి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ కలలో మోసం చేయడాన్నే నిపుణులు ‘డ్రీమ్ చీటింగ్’గా చెబుతారు.
డ్రీమ్ చీటింగ్ అనేది ఒక వ్యక్తి తన భాగస్వామితో కాకుండా వేరొకరితో సంబంధంలో ఉన్నట్లుగా సూచిస్తుంది. నిద్రలో రోజంతా సేకరించిన జ్ఞాపకాలు, భావోద్వేగాలు, వివిధ రకాల సమాచారాన్ని మన మెదడు విశ్లేషిస్తుంది. చాలా కాలంగా మనం తలవని వ్యక్తుల గురించి కూడా మనకు కలలు రావచ్చు. ఆ కల నిజమైన సంఘటన కాకపోవచ్చు కానీ, అది కలిగించిన భావోద్వేగాలు మాత్రం నిజమైనవి కావచ్చు.
తమ భాగస్వామి కన్న కల కారణంగా ఎవరైనా అసూయ, భయం లేదా అభద్రతా భావానికి లోనైతే ఆ భావనలను విస్మరించడానికి బదులుగా వాటి గురించి ప్రశాంతంగా చర్చించుకోవడం ఉత్తమం. కేవలం ఒక కల ఆధారంగా భాగస్వామి ఉద్దేశాలను అనుమానించడం లేదా ఆ కలను నమ్మకద్రోహానికి నిదర్శనంగా భావించడం సరైనది కాదు. ఒకవేళ సంబంధంలో అభద్రతా భావానికి కారణమయ్యే సమస్యలు ఇప్పటికే ఉంటే, అసలు సమస్యను పరిషరించుకోవడంపై దృష్టి పెట్టడం మరింత ముఖ్యం.