హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని, సీఎం కేసీఆర్ చేపట్టిన చరిత్రాత్మక, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే హ్యాట్రిక్ విజయం సాధిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు సమఉజ్జీ లేనేలేదని స్పష్టంచేశారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలకు ఏమాత్రం విశ్వసనీయత లేదని అన్నారు. కోమటిరెడ్డి విలువలు లేని వ్యక్తి, మునుగోడు ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీకి ఓటేయాలని చెప్పి అడ్డంగా దొరికిన నాయకుడని విమర్శించారు.
కిషన్రెడ్డీ.. చర్చకు సిద్ధమా?
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు తాడూ-బొంగరం లేదని మంత్రి తలసాని ఎద్దేవాచేశారు. 25 ఏండ్లపాటు అంబర్‌పేట ఎమ్మెల్యేగా కిషన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చేసిన అభివృద్ధిపై అంబర్‌పేట ఆలయంలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ర్టానికి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారనేది అందరికీ తెలుసని దెప్పిపొడిచారు. గాలిముచ్చట్లు చెప్పడం కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందని మండిపడ్డారు.
ఈసీకి ఇక్కడో నీతి.. అక్కడో నీతా?
ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్‌లో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నదని మంత్రి తలసాని ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగులో స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనకు ఏపీ సీఎంను అనుమతించిన ఈసీ.. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఏపీలోనూ ఎన్నికల కోడ్ ఉన్నదని, అక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన సచివాలయాన్ని బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. నూతన సచివాలయాన్ని భవిష్యత్తు తరాలకు అపురూప కానుకగా సీఎం కేసీఆర్ అందివ్వబోతున్నారని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.