అప్పటికి అతనిదో చిన్న కంపెనీ. ఉదయం నిద్రలేచే సరికి.. అది ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. కుటుంబ వ్యాపార అనుభవం తనది! ఎదురుగా పోటీ పడుతున్నది మాత్రం.. ఓ బహుళజాతి కంపెనీ. దాంతో, ఒకటికాదు, రెండుకాదు.. తన కంపెనీని కాపాడుకోవడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. భయం, ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయినా.. పట్టువదల్లేదు.
‘మైండ్ ఆన్.. హ్యాండ్స్ ఆఫ్’ ఫిలాసఫీని పాటిస్తూ.. తన కంపెనీని బతికించుకున్నాడు. రూ.50 వేల కోట్ల సంస్థగా మలిచాడు. అంతేకాదు.. తనకు పోటీగా వచ్చి, నిద్రలేకుండా చేసిన ఆ బహుళజాతి కంపెనీ బ్రాండ్‌నే కొనేసిన ‘విజేత’ జీవితానుభవం ఇది.
హార్ష్ మరివాలా.. అంటే చాలామంది తెలియదనే చెబుతారు. కానీ, ఆయన తయారు చేసిన కొబ్బరినూనెను ఎప్పుడో ఓసారి తప్పకుండా వాడే ఉంటారు. ఆయన మరెవరోకాదు.. ప్రఖ్యాత కొబ్బరి నూనె బ్రాండ్ ‘ప్యారాచూట్’ వ్యవస్థాపకుడు. చిన్న సంస్థగా ప్రారంభించి.. నేడు రూ.50వేల కోట్ల సామ్రాజ్యంగా విస్తరించారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ‘మీ విజయ రహస్యం ఏమిటీ?’ అని అడిగితే.. ‘మైండ్ ఆన్
– హ్యాండ్స్ ఆఫ్! ఇదీ నేను నమ్మిన ఫిలాసఫీ’ అని చెబుతారు.
హార్ష్ మరివాలా 1951లో ముంబైలో జన్మించారు. వీరి కుటుంబం కచ్ నుంచి ముంబైకి వలస వచ్చింది. మసాలా దినుసులు, వంట నూనెల హోల్‌సేల్ వ్యాపారం చేస్తుండేది. మరివాలా తండ్రి చారాందాస్, అతని సోదరులు 1948లో ‘బాంబే ఆయిల్ ఇండస్ట్రీ’ని స్థాపించారు. కొబ్బరి నూనె తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. హార్ష్ మరివాలా 1971లో బీకాం పూర్తి చేసి.. 20 ఏళ్ల వయసులోనే కుటుంబ వ్యాపారంలో చేరారు. అప్పటివరకు కొబ్బరి నూనెను ఇనుప డబ్బాల్లో అమ్మేవారు.
అయితే, ఆ డబ్బాలకే ఎక్కువ ఖర్చు కావడం, తుప్పు పట్టి నూనెకూడా పాడవ్వడం లాంటి సమస్యలు ఎదురయ్యేవి. అప్పుడే వ్యాపారంలోకి వచ్చిన హార్ష్.. ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం చూపాడు. కొబ్బరినూనెను ప్లాస్టిక్ బాటిల్స్‌లో ప్యాకింగ్ చేసి.. మార్కెట్లో సంచలనం సృష్టించాడు. వాటికి ‘ప్యారాచుట్’ బ్రాండ్ నేమ్‌ను కూడా తగిలించాడు. ఆ సమయంలో.. 70 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నారు. ఆ వెంటనే ‘సఫోలా’ పేరుతో సన్‌ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్‌నూ తీసుకువచ్చారు.
హాయిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలను కుటుంబ సభ్యుల్లోని కొందరు వ్యతిరేకించారు. లాభాలు కనిపిస్తున్నా.. కొత్తతరం ప్రయోగాలను పెద్దవాళ్లు స్వీకరించలేక పోయారు. దాంతో 1990లో ‘మారికో’ను స్థాపించారు హార్ష్. తండ్రి, మేనమామలు, సోదరులు ఒకవైపు ఉంటే.. హార్ష్ ఒక్కరూ మరోవైపు ఉండిపోయారు. సంస్థపై హక్కుల కోసం రెండేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగారు. అదే సమయంలో మార్కెట్లోకి బలమైన ప్రత్యర్థి దూసుకొచ్చింది.
అది అల్లాటప్పా సంస్థ కాదు. బహుళజాతి సంస్థ అయిన ‘హిందుస్థాన్ యూనీలివర్’. ‘నీహార్’ పేరుతో మార్కెట్లోకి తన బ్రాండ్ కొబ్బరి నూనెను తీసుకువచ్చింది. ప్యారాచూట్ కన్నా 30 శాతం ధరలు తగ్గించింది. ప్యారాచూట్‌ను మార్కెట్లోనే లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఈ పోటీతో హార్ష్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కంపెనీని కాపాడుకోవడానికి రాత్రింబవళ్లూ కష్టపడ్డారు.
ఓవైపు కుటుంబ వ్యాపార వివాదాలు, మరోవైపు మార్కెట్లో బలమైన ప్రత్యర్థి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకే ఒక్క ఫిలాసఫీ తనను బయట పడేసిందని చెబుతారు హార్ష్. అదే.. ‘మైండ్ ఆన్ – హ్యాండ్స్ ఆఫ్!’. ఈ ఫిలాసఫీ గురించి చెబుతూ.. ‘నాయకునిగా ఒక కంపెనీని నడిపించేందుకు ఇదే ప్రధాన సూత్రం. మైండ్.. మనసును పనిలో పూర్తిగా నిమగ్నం చేయాలి. వ్యూహాలు, కంపెనీకి సంబంధించి వినూత్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆలోచనలతో మనసు పూర్తిగా బిజీగా ఉన్నా.. చేతులు మాత్రం ఖాళీగా ఉండాలి.
అంటే.. రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. సమర్థులైన బృందాన్ని ఏర్పాటు చేసుకొని, తమ పని తాము చేసుకొనే అవకాశం ఇవ్వాలి’ అంటారు. ఈ సూత్రాన్ని తాను నమ్మడమే కాకుండా ఆచరణలోనూ పెట్టి అద్భుతమైన విజయం సాధించారు. అప్పటివరకూ ఒకేరకమైన కొబ్బరి నూనెకు అలవాటు పడిన భారతీయులకు.. అందులోనూ అనేక రకాల ఫ్లేవర్లను పరిచయం చేశారు. ‘కొబ్బరి నూనె అంటే.. ప్యారాచుట్ మాత్రమే!’ అనుకునే వరకూ తన సంస్థను తీసుకెళ్లారు. మరో అడుగు ముందుకేసి.. తనకు పోటీగా వచ్చి, ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చిన ‘నీహార్’ కొబ్బరినూనె బ్రాండ్‌ను కూడా కొనుగోలు చేశారు.
కుటుంబ వ్యాపారాన్ని వేలకోట్ల సామ్రాజ్యంగా విస్తరించిన హార్ష్ మరివాలా.. తన జీవితంలో ఒకేఒక లోపం ఉన్నదని అంటారు. తనకు ఇద్దరు పిల్లలు. వ్యాపారంపైనే దృష్టిపెట్టి.. పిల్లల్ని పెద్దగా పట్టించుకోలేదని చెబుతారు. పిల్లల చిన్నతనాన్ని చాలా మిస్ అయ్యాననీ, అది తనను ఇప్పటికీ చాలా బాధపెడుతుందనీ అంటాడు హార్ష్ మరివాలా. మొత్తానికి, తన ప్రయోగాలకు ఉమ్మడి కుటుంబం అడ్డుతగిలినా, తనను దెబ్బ తీయాలని బహుళజాతి కంపెనీ ప్రయత్నించినా.. పట్టుదల, తన మీద తనకు నమ్మకం ఉంటే విజయం సాధించవచ్చని హార్ష్ మరివాలా జీవితం నిరూపిస్తుంది.
– బుద్దా మురళి, 98499 98087