హైదరాబాద్ : బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ సమస్యలపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో కాంగ్రెస్ పార్టీకి తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై(NRI )శ్రేణులకు జలపాఠాలు బోధిస్తూ, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో విడమరిచి వివరించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టుపై చేస్తున్న కుట్రలను గులాబీ ఎన్నారై శ్రేణులకు స్పష్టంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఐదేండ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే అని చెప్తున్న మీరు, కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు లిఫ్ట్ చేసిన విషయాన్ని ఎందుకు చెప్పరు? లక్ష్మి, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల గురించి ఎందుకు దాస్తారు? కాళేశ్వరం కట్టిన మూడేండ్లలోనే, అంటే 2022-23 వరకు మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది పంప్‌హౌస్ నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్ నుంచి 179.41 టీఎంసీల జలాలను ఎత్తిపోశాం అన్నారు. మీ ఇంజినీర్లను అడిగి తెలుసుకోండి. గోబెల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు కుట్ర
అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక) లేదని కొందరు బురద చల్లే ప్రయత్నం చేశారని, కానీ డీపీఆర్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తుందని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని అనుమతులను తెచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు. ప్రజెంటేషన్ అనంతరం, బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు హరీశ్ రావును ప్రత్యేకంగా అభినందించారు. అదే సమయంలో ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ విచారణ గురించి కూడా హరీశ్ రావు మాట్లాడారు.
ఈ కేసులో జరిగిన లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, రాష్ట్ర ప్రతిష్టను కాపాడేందుకు ఆ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కేటీఆర్‌ను, కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి పాత కేసులతో రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే, ప్రజల్లో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణ రాబోయే రోజుల్లో ఈ కుట్రలను భంగపాటు చేస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాగా, తక్కువ సమయంలో వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుకి మహేష్ బిగాల ధన్యవాదాలు తెలిపారు.