ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా? లేనట్టా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని గురువారం ఒక ప్రకటనలో హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడులను ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ నిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులకు పురిగొల్పడం బాధాకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డిలపై చోటుచేసుకున్న దాడులను గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అగ్ర నాయకులను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడితే పోలీసులు ఏ మాత్రం స్పందించకపోవడం, కేసులు పెట్టకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. గంగుల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, కౌశిక్‌రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు అడ్డుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీజేపీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో దేశంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బండి సంజయ్, తన నియోజకవర్గంలో అసాంఘికశక్తులను దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ మూకల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. కరీంనగర్‌లోని జ్యువెలరీలో పట్టపగలు కాల్పులు జరిపి నగలు దొంగిలించి నాలుగు రోజులు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన కేవలం 10 నిమిషాల్లోనే బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడటం ముందస్తు ప్రణాళికగా పేర్కొన్నారు. బండి సం జయ్.. కేటీఆర్‌ను ఇష్టారీతిన దూషిస్తే, ఎందుకు దూషించారని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఈ దాడి పూర్తిగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బీజేపీ శ్రేణులు జరిపిన దాడి నాగరిక సమాజం తలదించుకోవాల్సిన ఉదంతమని శాసనమండలి బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రజాప్రతినిధుల కార్యాలయాలకే భద్రత లేకపోతే, సామాన్య పౌరుడి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఈ దాడిని గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. భౌతిక దాడులతో అణచివేయాలనుకోవడం పిరికిపంద చర్యగా విమర్శించారు.
జనగామ (నమస్తే తెలంగాణ), మే 7: అహంకార, అరాచక రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించరని, అలాంటి వారికి సరైన సమయంలో బుద్ధిచెప్తారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బండి సంజయ్ అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడి ఒక వ్యక్తిపై మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే బీజేపీ గూండాలు దాడులకు తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాల్లో మాటకు మాటతో సమాధానం చెప్పాలి కానీ, కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాడులు చేసి విధ్వంసానికి పాల్పడటం బీజేపీ అసలు స్వభావాన్ని బయటపెట్టిందని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దురదృష్టకరమని చెప్పారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంపై బీజేపీ గుండాల దాడిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలకులు సమాధానం చెప్పాలనే కనీస సోయి లేని బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని విమర్శించారు. రైతాంగం సమస్యల పరిషారం కోసమే బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తున్నదని, ఎన్నికల కోసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు, రైతులు ఉద్యమిస్తే, వారిని అణచడానికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి దాడులకు దిగడం కుమ్మకు రాజకీయాల్లో భాగమేనని విమర్శించారు.
కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ ఇలా రౌడీయిజాన్ని ప్రోత్సహించడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆయన కరీంనగర్ ఎంపీగా ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు. కేంద్ర మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న పీఎంజే జ్యువెల్లరీలో చోరీ, కాల్పుల ఘటనలో నిందితులను ఇప్పటికీ పట్టుకోకపోవడం శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కూడబలుక్కొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై భౌతిక దాడులకు దిగడం వారి చీకటి మైత్రికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు చేయడం కరీంనగర్లో ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని బీజేపీ నాయకులు.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి దిగడం శోచనీయమని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడి గర్హనీయమని పోలీస్ హౌసింగ్ సొసైటీ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన కొద్దిసేపటికే బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ శ్రేణులు దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలని దామోదర్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.
కరీంనగర్లో దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తక్షణమే ప్రభుత్వం కరీంనగర్ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చాడ డిమాండ్ చేశారు.
చేతిలో అధికారం ఉన్నదని ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల కార్యాలయాలపై బీజేపీ మూకలు దాడికి దిగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ హెచ్చరించారు. కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడులు చేయడం దుర్మార్గమని ఖండించారు. దాడుల ద్వారా తెలంగాణను బెంగాల్‌గా మార్చాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం మాట్లాడితే పెదవులు విప్పని రాష్ట్ర బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ను విమర్శించే హకు లేదని హెచ్చరించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.