Happy Birthday Prabhas | ఈ రోజు అక్టోబర్ 23, 2025 .. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత అభిమానులు కలిగిన స్టార్ హీరో ప్రభా పుట్టిన రోజు. ఈ రోజు డార్లింగ్ తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1979లో చెన్నైలో జన్మించిన ప్రభాస్.. “బాహుబలి” సినిమా తర్వాత దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించిన ఆయన, ప్రముఖ నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు గారి మేనల్లుడు. చిన్నప్పటి నుంచి వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ, మామయ్య ప్రేరణతో సినిమా రంగంలో అడుగుపెట్టారు.
2002లో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, వర్షం, చత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో స్టార్డమ్ అందుకున్నారు. అయితే ఆయన కెరీర్‌కు మలుపు తిప్పిన చిత్రం బాహుబలి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రభాస్‌ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నాలుగేళ్లు ఇతర సినిమాలు చేయకుండా పూర్తిగా అంకితమయ్యారు.బాహుబలి విజయం తరువాత ప్రభాస్‌కి దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ అభిమానులు పెరిగిపోయారు. 2017లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన ప్రతిమను ఉంచగా, దక్షిణాది నటులలో ఈ గౌరవం పొందిన మొదటి నటుడు ప్రభాస్ కావడం విశేషం.
ఈ రోజు ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో #HappyBirthdayPrabhas, #DarlingTurns46, #RebelStarDay వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభాస్ వ్యక్తిత్వం ఎంత సైలెంట్‌గా ఉంటుందో, ఆయన హృదయం అంత పెద్దది అంటారు ఆయన స్నేహితులు. లైమ్‌లైట్‌కి దూరంగా, సేవా కార్యక్రమాల్లో మౌనంగా పాల్గొనే ప్రభాస్ నిజమైన హ్యూమనిటేరియన్. ఇండస్ట్రీలో ప్రభాస్ అందరికి ప్రేమని పంచుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా లైట్ బాయ్స్‌ని కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇక ప్రభాస్ ఆతిథ్య మర్యాదలకి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ మధ్య మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఆయన ఫుడ్ పెట్టి చంపేస్తారని, ప్రభాస్ ఉన్నప్పుడు డైట్ చేయడం కుదరదని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ ఫిట్నెస్కి అసాధారణ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజూ జిమ్‌లో గంటల కొద్దీ వర్కౌట్ చేస్తారు. ఆయన ఇంట్లోనే అత్యాధునిక పరికరాలతో కూడిన పెద్ద జిమ్ ఉంది. బాడీ మెయింటైన్ చేసుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ ఎంతో కట్టుదిట్టంగా ఉంటారు. షూటింగ్‌లకు వెళ్లినా కూడా తన ఫిట్నెస్ మిస్ అవ్వరు. వర్కౌట్‌తో పాటు ఆయనకు వాలీబాల్ చాలా ఇష్టం . షూటింగ్ బ్రేక్‌లలో కూడా స్నేహితులతో కలిసి ఆట ఆడుతూ రిలాక్స్ అవుతారు. ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో అద్భుతమైన విల్లాలో నివసిస్తున్నారు. ఈ విల్లా విలువ సుమారు ₹60 కోట్లు అని చెబుతారు. ఇంటిలో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, పెద్ద గార్డెన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుడైన ప్రభాస్ తన ఇంటి చుట్టూ పచ్చదనాన్ని కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.అలాగే ఆయనకు భీమవరం సమీపంలో 84 ఎకరాల ఫార్మ్‌హౌస్ ఉంది. షూటింగ్స్ లేని రోజుల్లో అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఇటలీలో ఒక విల్లా ఆయన సొంతం.
ప్రభాస్ దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రతి సినిమా కోసం ఆయన ₹80 కోట్ల నుంచి ₹150 కోట్ల వరకు వసూలు చేస్తారు.మొత్తం నెట్ వర్త్ ₹241 కోట్లుగా అంచనా. అలాగే ఆయనకు ఉన్న బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ప్రతి సంవత్సరం ₹50 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.ప్రభాస్‌కి లగ్జరీ కార్లంటే ప్రత్యేక ఇష్టం. ఆయన గ్యారేజీలో ఉన్న హై-ఎండ్ వాహనాల జాబితా లో రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, లాంబోర్గినీ అవెంటడార్ రోడ్‌స్టర్, జాగ్వార్ XJR, BMW X3 ఉన్నాయి. ప్రభాస్ తొలిసారిగా బాలీవుడ్లో ఆక్షన్ జాక్సన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. ఆ తర్వాత 2019లో వచ్చిన సాహో సినిమా ద్వారా ప్రధాన పాత్రలో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.