ప్రముఖ రాజకీయ నాయకుడు, పేదప్రజల పక్షపాతిగా, ప్రజల మనిషిగా గుర్తింపును తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబోతున్నది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ పోషించబోతున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవళ్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎన్.సురేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు.
బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో గుమ్మడి నర్సయ్య పాత్రలో శివరాజ్‌కుమార్ అద్భుతంగా ఒదిగిపోయి కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి కార్లలో వస్తుంటే..గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌పై వచ్చే విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: సురేష్ బొబ్బిలి, దర్శకత్వం: పరమేశ్వర్ హివ్రాలే.