యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పంచాయతీ కార్మికులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్న యాదాద్రి కలెక్టర్ పమేలాసత్పతిని మంత్రి కేటీఆర్ అభినందించారు. గ్రేట్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. కార్మికుల్లో ఉత్సాహం నింపేలా చేనేత వస్ర్తాలతో కొత్త డ్రెస్‌కోడ్ రూపొందించేందుకు 3 నెలల క్రితం కలెక్టర్ సంకల్పించారు. ఇందుకోసం కొయ్యలగూడేనికి చెం దిన తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, పోచంపల్లి వీవర్స్‌కు బాధ్యతలు అప్పగించారు. పురుషులకు ఖాకీ ప్యాంట్, ఆకుపచ్చ షర్ట్.. మహిళలకు ఎరుపు జరీ అంచుతో కూడిన స్కై బ్లూ చీరలను ఫైనల్ చేశారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, 421 పంచాయతీల్లో డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నారు. కార్మికుల కొత్త డ్రెస్‌కోడ్‌పై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. పత్రిక క్లిప్పింగ్స్తోపాటు కార్మికుల చిత్రాలను కలెక్టర్.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్.. మున్సిపాలిటీ, పంచాయతీ కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు డ్రెస్ కోడ్ అమలుకు చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.