ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నారాయణరావు జన్మస్థలం కృష్ణాజిల్లా కురుమద్దాలి. బాల్యం అంతా గుంతకల్లులో సాగింది. కె.బాలచందర్ ‘అంతులేని కథ’(1976) నారాయణరావు తొలి సినిమా. అందులో పోషించిన ‘వికటకవి గోపాల్’ పాత్ర నారాయణరావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్న ఘనత నారాయణరావుది. ఆ సినిమాలో నారాయణరావుపై చిత్రీకరించి ‘తాళికట్టు శుభవేళ.. మెడలో కల్యాణమాల’ పాట పెద్ద హిట్.
ముత్యాలపల్లకి, అంగడి బొమ్మ, సుబ్బారావుకు కోపమొచ్చింది తదితర చిత్రాల్లో హీరోగా నటించిన నారాయణరావు, ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా మారి వందకు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు. ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రాల్లో చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్‌లీడర్, హిట్లర్ ఉన్నాయి. మద్రాస్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న నారాయణరావుకు రజనీకాంత్, చిరంజీవి మంచి మిత్రులు. నారాయణరావు నిర్మాత కూడా. దమయంతి ఆర్ట్స్ పిక్చర్స్ స్థాపించి తొలి ప్రయత్నంగా చిరంజీవితో ‘దేవాంతకుడు’ చిత్రాన్ని నిర్మించారాయన. అలాగే ఇంటికో రుద్రమ్మ, పెళ్లి నీకు శుభం నాకు చిత్రాలకు కూడా ఆయనే నిర్మాత. డైనమిక్ మూవీమేకర్స్ పతాకంపై మిత్రులు సుధాకర్, హరిప్రసాద్లతో కలిసి చిరంజీవి హీరోగా నారాయణరావు నిర్మించిన ‘యముడికి మొగుడు’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లోనూ ఆయన నటించారు.
నారాయణరావుతో నాకు సన్నిహితమైన సంబంధం ఉంది. దేవాంతకుడు, యముడికి మొగుడు చిత్రాలను నాతో నిర్మించారాయన. మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
– చిరంజీవి