హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వివిధ చోట్ల గురుకుల కళాశాలలను కుదించేందుకు కసరత్తు చేపట్టింది. సీవోఈ కాలేజీల్లోనూ కొన్ని గ్రూపులను ఎత్తేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సొసైటీ ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్ల కోసం జారీచేసిన నోటిఫికేషన్ కూడా కాలేజీల కుదింపు తప్పదనేందుకు బలాన్ని చేకూరుస్తున్నది. ఇక ఇప్పటికే పలు డిగ్రీ కాలేజీలను విలీనం చేయగా, తాజాగా మరికొన్నింటిని పూర్తిగా ఎత్తేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియను ఇప్పటికీ ప్రకటించలేదని సొసైటీ అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. సొసైటీ ఉన్నతాధికారుల నిర్ణయంపై ఇటు గురుకుల యూనియన్లు, మరోవైపు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు 2007లో కరీంనగర్ జిల్లా అలుగునూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటుచేశారు. గురుకుల వ్యవస్థలోనే మొదటిసారి కో-ఎడ్యుకేషన్ విధానాన్ని 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్య వరకు ఇక్కడ ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి ఎంతో మంది విద్యార్థులు ఎన్నో ఉత్తమ ఫలితాలను సాధించారు. కానీ కారణాలేవీ చెప్పకుండానే ప్రస్తుతం ఇక్కడ కో ఎడ్యుకేషన్ విధానాన్ని ఎత్తివేయాలని సొసైటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సీవోఈ కళాశాలను కేవలం బాలికలకే పరిమితం చేసింది. ఇప్పటికే కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు, కాలేజీ సిబ్బందికి సొసైటీ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎస్సీ సొసైటీ పరిధిలోని సుమారు 80 కాలేజీల్లో గురుకుల జూనియర్ కాలేజీల్లో కొన్ని గ్రూపులకే పరిమితం చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. కొన్నిచోట్ల కేవలం బైపీసీ, ఎంపీసీ, మరికొన్ని చోట్ల కేవలం సీఈసీ, ఎంఈసీ గ్రూపులనే కొనసాగిచాలని ప్రతిపాదనలు చేశారు. ఈ విద్యా సంవత్సరం 12 గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లనే తీసుకోవద్దని సొసైటీ ఉన్నతాధికారులు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం సొసైటీ ఈ ఏడాది ఏప్రిల్ 24న నోటిఫికేషన్ జారీ చేసింది. 7 ప్రీమియర్ సీఈవోలు, 31 నాన్ ప్రిమియర్ సీవోలు, 201 నాన్ సీవోఈ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్లో విద్యార్థులకు సూచించింది. అయితే అందులోనూ సొసైటీ అనేక విషయాలను గోప్యంగా ఉంచింది. ఏ గ్రూపు సీట్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనేది నోటిఫికేషన్లో స్పష్టంగా సొసైటీ పేర్కొనలేదు. విద్యార్థులు కేవలం తాము ఎంపిక చేసుకునే గ్రూపునే ఆర్డర్లో ఆప్షన్ ఇవ్వాలని వెల్లడించడం గమనార్హం. దీనిని బట్టే కాలేజీల సంఖ్యను సొసైటీ కుదిస్తున్నదని స్పష్టంగా తెలిసిపోతున్నది. ఈ ఏడాది ఎస్సీ కన్వర్టెడ్ సీట్లకే ఎసరు పెట్టారు. ఈ ఏడాది కన్వర్టెడ్ క్రిస్టియన్స్కు సంబంధించిన సీటును సొసైటీ తొలగించింది. ఆ 1 సీటును ఓసీలకు కేటాయించింది. వాస్తవంగా ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీ సీ గ్రూపు కిందకు వస్తారు. ఒకవేళ ఆ సీటును కేటాయించాల్సి వచ్చినా బీసీలకు కలపాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఓసీలకు కలపడంలో ఆంతర్యమేంటో తెలియని పరిస్థితి నెలకొన్నది.
గురుకుల కాలేజీ కుదింపు, కోర్సుల నిర్వహణపై పరిమితులు విధించాలనే సొసైటీ ఉన్నతాధికారుల నిర్ణయంపై ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, మరోవైపు గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ యూనియన్లు నిప్పులు చెరుగుతున్నాయి. అనాలోచితంగా, అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తప్పుడుపడుతున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీని పూర్తిగా నిర్వీర్యం చేసే దురుద్దేశమేనని మండిపడుతున్నారు. ఆయా అంశాలపై సీఎం రేవంత్రెడ్డి తక్షణం జోక్యం చేసుకొని తప్పుడు నిర్ణయాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భారీ ఉద్యమం చేపడుతామని పేరెంట్స్ సంఘాలు, గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ యూనియన్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.