Maharashtra | ముంబై: గుజరాత్లోని అహ్మదాబాద్లో జీఎస్టీ చీఫ్ కమిషనర్గా పనిచేస్తున్న చంద్రకాంత్ వాల్వికి సంబంధించిన భారీ భూమి కొనుగోలు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు సమీపంలోని కందాడి లోయలోని ఓ గ్రామాన్నే కొనుగోలు చేశాడని పలు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి చంద్రకాంత్ ఝదాని గ్రామ పరిధిలో కొనుగోలు చేసిన ఈ భూమి విస్తీర్ణం దాదాపు 620 ఎకరాలు ఉంటుందని అంచనా. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాకు చెందిన చంద్రకాంత్ ప్రస్తుతం గుజరాత్లో జీఎస్టీ కమిషనర్గా పనిచేస్తున్నారు.
ఆయన మీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందని గ్రామంలోని ప్రతి ఒక్కరికీ చెప్పాడని సుశాంత్ మోర్ అనే స్థానిక సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ఈ భూమి కొనుగోలులో పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ వంటి ముఖ్యమైన చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయి. ఈ చట్టాలను ఉల్లంఘించడం వలన సహజ వనరులు, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. గత మూడేండ్లుగా అక్రమ కార్యకలాపాలు సాగుతున్నా, అధికారులు ఆ వైపు చూడలేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.