విద్యుత్తు ప్రాజెక్టులపై కాంట్రాక్టర్ల అనాసక్తి
రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్టుల పనులు చేపట్టాలంటేనే కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. టెండర్లు పిలిస్తే ఒక్కరూ ముందుకు రావడం లేదు. ‘వామ్మో పవర్ టెండర్లా?’ అంటూ బెంబేలెత్తిపోతున్నారు.
- జహీరాబాద్ నిమ్జ్‌కు పదిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువు
- కోకాపేట సబ్‌స్టేషన్ టెండర్లు రద్దు
- మహేశ్వరం ‘బేస్’దీ ఇదే పరిస్థితి
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్టుల పనులు చేపట్టాలంటేనే కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. టెండర్లు పిలిస్తే ఒక్కరూ ముందుకు రావడం లేదు. ‘వామ్మో పవర్ టెండర్లా?’ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కీలక ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కడం లేదు. కొన్ని ప్రాజెక్టులకు ఏకంగా పదిసార్లు టెండర్లు పిలిచినా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో విద్యుత్తు పనులకు టీజీ ట్రాన్స్‌కో పదిసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది.
కోకాపేట 400కేవీ, 220కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో చివరికి ఈ టెండర్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ (బెస్) ప్లాంట్ టెండర్‌ను దక్కించుకున్న సంస్థ.. చివరికి ఆ పనులు చేయలేమంటూ చేతులెత్తేసింది. డిస్కమ్‌లలో సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్ల నిర్మాణ పనులది ఇదే పరిస్థితి. దక్షిణ డిస్కమ్ అండర్ గ్రౌండ్ కేబుల్ టెండర్ల ప్రీ-బిడ్ సమావేశంలో కాంట్రాక్టర్లు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
సామగ్రి కొరతతో సతమతం
రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్టుల టెండర్లను దక్కించుకున్నప్పటికీ సంబంధిత సామగ్రి కొరత వల్ల పనులు చేపట్టలేని పరిస్థితులున్నాయని గుత్తేదారులు చెప్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు, ఏబీ స్విచ్‌లు, కండక్టర్ల సరఫరా చాలా తక్కువగా ఉన్నది. వీటి ఉత్పత్తిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో కొన్ని కంపెనీలు అడ్వాన్సులు చెల్లించి మెటీరియల్‌ను బుక్ చేసుకుంటున్నాయి.
దీంతో ఆ సామగ్రి మార్కెట్లో దొరుకడం లేదు. ఫలితంగా పనుల పురోగతిపై ప్రభావం పడుతున్నది. మరోవైపు పవర్ ట్రాన్స్ఫార్మర్లకు కావాల్సిన ఆయిల్ కూడా అందించలేని పరిస్థితి నెలకొన్నది. ట్రాన్స్‌కోకు చెందిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి తీసిన ఆయిల్‌ను శుద్ధిచేసి డిస్కమ్‌లకు చెందిన ట్రాన్స్ఫార్మర్లకు వినియోగిస్తున్న ఉదంతాలున్నాయి.
ధరల్లో తీవ్ర వ్యత్యాసం
విద్యుత్తు పనులకు సంబంధించిన స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్)ను కొంత కాలం క్రితం సవరించారు. సవరించిన ధరలకు ఈఆర్సీ ఆమోదముద్ర వేసింది. ఇంతలోనే మార్కెట్లో రేట్లు పెరిగాయి. ఉక్రెయిన్-రష్యా, అమెరికా-ఇరాన్ యుద్ధాలు, హొర్మూజ్ జలసంధి మూసివేత తదితర పరిణామాల వల్ల రాగి ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో విద్యుత్తు పరికరాలు, సామగ్రి ధరలు పెరిగాయి. ఎస్ఎస్ఆర్ రేట్లకు, మార్కెట్ ధరలకు మధ్య 5 నుంచి 10% వరకు వ్యత్యాసమున్నదని, ఈ ధరలతో పనులు చేయలేకపోతున్నామని కాంట్రాక్టర్లు చెప్తున్నారు.
మళ్లీ ఈఆర్సీ చెంతకు
కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, పనులు ముందుకు సాగకపోవడంతో ట్రాన్స్‌కో సహా విద్యుత్తు సంస్థలు మీమాంసలో పడిపోయాయి. ఎస్ఎస్ఆర్ రేట్లను సవరించాలని ప్రీ-బిడ్ సమావేశంలో కోరిన కాంట్రాక్టర్లు.. మార్కెట్ ధరలకు అనుగుణంగా రేట్లు లేకపోతే పనులు చేపట్టం సాధ్యంకాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఆర్ ధరల సవరణ అనివార్యమని విద్యుత్తు సంస్థల అధికారులు భావిస్తున్నారు. తాజా మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని ఎస్ఎస్ఆర్ రేట్లను సవరించేందుకు మళ్లీ ఈఆర్సీని ఆశ్రయించాలని నిర్ణయించారు. అప్పటిదాకా విద్యుత్తు ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కే పరిస్థితి లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

