న్యూయార్క్, జూన్ 21: మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ ఎన్నికైతే.. అమెరికా కాలేజీల్లో పట్టభద్రులయ్యే విదేశీ విద్యార్థులకు వెంటనే గ్రీన్ కార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లకుండా నివారించేందుకు వారికి శాశ్వత నివాసం కల్పించే గ్రీన్‌కార్డులను జారీ చేస్తామని చెప్పారు. అమెరికాలో విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లి కోటీశ్వరులవుతున్నారని అన్నారు. వచ్చే నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వలసలపై ట్రంప్ వైఖరిలో మార్పురావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థికి డిప్లొమా సర్టిఫికెట్‌తోపాటు గ్రీన్‌కార్డు కూడా జారీ చేయాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిబంధన జూనియర్ కాలేజీలకు వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో వలసల అంశం కీలకంగా మారింది.