భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కృష్ణా-గోదావరి నదీ జలాల పంపిణీలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని, దీనిపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు. విద్యావంతుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏగునుల రాకేశ్‌రెడ్డి నిరుద్యోగ అభ్యర్థుల కోసం రూపొందించిన ఈ క్లాస్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రెండు నదుల పరీవాహకంలో తెలంగాణ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఉదాసీన వైఖరితో ఆ నీటిని ఏపీకి తరలించుకుపోతున్నారని విమర్శించారు.
గోదావరి-కావేరి నదులు అనుసంధానం జరిగితే.. అది తెలంగాణ భూ భాగం నుంచే జరుగాలని ఆనాడే కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నదీ జలాలను తరలించడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా, రేవంత్‌రెడ్డి మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీలు దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి పార్లమెంట్, ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. నిరుడు కేసీఆర్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలే తప్ప, నేటికీ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని వివరించారు.
ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల మీదుగా వెళ్లే రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తప్పుడు విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నారని తెలిపారు. రాకేశ్‌రెడ్డి రూపొందించిన ఈ క్లాస్ యాప్ నిరుద్యోగ అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.