హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థినులకు ప్రభుత్వం స్టైపెండ్ ను భారీగా పెంచింది. దీంతోపాటు ఎమ్మెస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులకు తొలిసారి స్టైపెండ్ మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లు, నర్సింగ్ కాలేజీలు, నిమ్స్‌లో చదువుతున్న జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. తాజా ఉత్తర్వులతో ప్రతి ఒక్కరికీ స్టైపెండ్ కనీసం 3 రెట్లు పెరుగనున్నది. దేశంలోనే నర్సింగ్ విద్యార్థులకు అత్యధిక స్టైపెండ్ ఇస్తున్నది తెలంగాణలోనేనని అధికారులు తెలిపారు. దీంతో నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరనున్నది. ఈ ఏడాది జూలైలో సీఎం కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడి నర్సింగ్ విద్యార్థులు తమకు స్టైపెండ్ తక్కువగా వస్తున్నదని విన్నవించారు. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి నర్సింగ్ విద్యార్థులందరికీ స్టైపెండ్ భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు.