తాండూర్ : వరి ధాన్యం అన్ లోడింగ్ ( Grain Unloading ) ప్రక్రియను వేగవంతం చేయాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ( Sub-Collector Manoj) ఆదేశించారు. శుక్రవారం తాండూర్ మండల కేంద్రంలోని కార్తికేయ రైస్ మిల్లును తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. వరి కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని అధికారులను కోరారు.
గోదాములకు తరలించిన వరి ధాన్యాన్ని నిబంధనల ప్రకారం నిలువ చేయాలని, తదుపరి ఆదేశాలు ప్రకారం తరలించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్ కలెక్టర్ వెంట ఆర్ఐ బొలిశెట్టి పద్మజా, రెవిన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు.