హనుమకొండ, జూలై 9 : ‘మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ సామాజిక చైతన్య ఉద్యమంగా మారాలి.. మత్తురహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని’ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గురువారం హనుమకొండలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ -డ్రగ్స్ రహిత తెలంగాణ’ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిషరించారు. కార్యక్రమంలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని చేపట్టిన సంతకాల సేకరణలో గవర్నర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలతో కలిసి ‘నషా ముక్త్ భారత్’ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ ఎక్సైజ్, యాంటీ నారోటిక్స్ బ్యూరో, పోలీస్, జిల్లా మహిళా,శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీని గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, మహిళల కృషిని అభినందించారు. హనుమకొండ, వరంగల్ జిల్లా అధికారులతో సమీక్షించారు. డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగాఉండాలని గవర్నర్ సూచించారు. హనుమకొండ జిల్లా రెడ్‌క్రాస్, ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.