న్యూఢిల్లీ : డెన్మార్క్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ బుధవారం ‘అవిక్లి/ఇన్సులిన్ ఐకోడెక్’ను ప్రారంభించింది. ఇది టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్న వారి కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వారానికి ఒకసారి తీసుకొనే బేసల్ ఇన్సులిన్. ఇది ఏడాదికి ఇన్సులిన్ ఇంజెక్షన్ల సంఖ్యను 365 నుంచి 52కి తగ్గించడం ద్వారా డయాబెటిస్ చికిత్సలో ఒక గణనీయమైన మార్పును తీసుకురానుంది. ఇన్సులిన్ అనేది రక్తప్రవాహం నుంచి గ్లూకోజ్(చక్కెర)ను కణాలలోకి చేర్చడానికి సహాయపడే ఒక హార్మోన్.
ఇది రక్తప్రవాహంలో చక్కెర పేరుకుపోకుండా నిరోధిస్తుంది. టైప్ 1 డయాబెటిస్ లేదా అడ్వాన్స్డ్ టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచుకోవడానికి సాధారణంగా రోజుకు ఒకసారి, కొన్నిసార్లు రోజుకు అనేకసార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ ఇంజెక్షన్లు తీసుకోవడానికి చాలామంది భయపడతారని, దానివల్లే భారత్‌లో ఇన్సులిన్ చికిత్సను ప్రారంభించడం సగటున ఏడు నుంచి తొమ్మిదేండ్లు ఆలస్యమవుతున్నదని బ్లాక్‌బస్టర్ డయాబెటిస్, ఊబకాయం ఔషధం ‘సెమాగ్లుటైడ్’ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ తెలిపింది. ఆ భయాన్ని నివారించడానికే ఈ కొత్త చికిత్స రూపొందించినట్టు పేర్కొంది.
భారతదేశంలో దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్ రోగులు, దాదాపు 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్ ఉన్నవారు ఉన్నారు. దేశంలో 9 లక్షల కంటే ఎక్కువ మంది టైప్ 1 డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ పరిస్థితి. దీని నిర్వహణ పూర్తిగా ఇన్సులిన్ చికిత్సపైనే ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల వచ్చే జీవక్రియ కారణాలతో కూడిన టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో దాదాపు 10 శాతం మందికి కూడా ఇన్సులిన్ చికిత్స అవసరం అవుతుంది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి ఐదు ఇన్సులిన్ బ్రాండ్లలో మిక్స్‌టార్డ్, రైజోడెగ్తో సహా నాలుగు బ్రాండ్లు ప్రస్తుతం నోవో నార్డిస్క్ తయారు చేస్తున్నది. ఈ ఔషధాల పంపిణీ కోసం సంస్థ భారత్‌లో అబాట్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది.
700 యూనిట్ల అవిక్లి ప్యాక్ ధర రూ. 2,611గా ఉన్నది. అంటే యూనిట్‌కు రూ. 3.73 చొప్పున పడుతుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోజువారీ ఇన్సులిన్ యూనిట్ల ధర కంటే దాదాపు 30-40 శాతం చౌక అని ఔషధ తయారీ సంస్థ తెలిపింది. డయాబెటిస్ నిర్వహణ కోసం ఇన్సులిన్ చికిత్సను ప్రారంభించే చాలామంది రోగులకు రోజుకు 10 యూనిట్ల వరకు అవసరమవుతుంది. అటువంటి రోగులకు వారానికి 70 యూనిట్ల ఇన్సులిన్ కావాలి. దీని ధర వారానికి దాదాపు రూ. 261 అవుతుంది. చాలామంది వైద్యులకు ఈ ధర ఆశ్చర్యకరంగా అనిపించింది. “అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న రోజువారీ బేసల్ ఇన్సులిన్ ధరకు సమానంగా, అత్యంత పోటీతత్వ ధరతో అవిక్లిని ప్రారంభించడం.
ఇది ఈ ఆవిష్కరణను కొందరికే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తెస్తుంది” అని ముంబైకి చెందిన జీవక్రియ వ్యాధుల నిపుణుడు, డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ కోవిల్ అన్నారు. ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఎస్కే వాంగ్నూ మాట్లాడుతూ.. ఇన్సులిన్ ఆలస్యంగా ప్రారంభించడం, చికిత్సను సరిగ్గా పాటించకపోవడం డయాబెటిస్ ఫలితాలను దెబ్బతీస్తూనే ఉన్నాయని, చికిత్సను సరళీకృతం చేసే ఆవిష్కరణలు రోగుల అంగీకారాన్ని మెరుగుపరుస్తాయని, సకాలంలో చికిత్స అందించడానికి వీలు కల్పిస్తాయని అన్నారు. రోజువారీ వాడకం అవసరమయ్యే సంప్రదాయ బేసల్ ఇన్సులిన్‌లా కాకుండా అవిక్లిని ‘ఫ్లెక్స్‌టచ్’ అనే పెన్ పరికరం ద్వారా వారానికి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ సరళీకృత విధానం చికిత్సను క్రమం తప్పకుండా పాటించడాన్ని మెరుగుపరుస్తుందని, చికిత్స ప్రారంభించడానికి వెనుకాడుతున్న రోగులలో త్వరగా ఇన్సులిన్ ప్రారంభించేలా ప్రోత్సహిస్తుందని కంపెనీ తెలిపింది. ఇటీవలి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 డాటా కూడా పట్టణ, గ్రామీణ జనాభా రెండింటిలోనూ అధిక రక్త చక్కెర వ్యాప్తి గణనీయంగా పెరిగినట్టు సూచిస్తున్నది. నోవో నోర్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ మాట్లాడుతూ.. ఈ ఆవిష్కరణ దేశంలో మధుమేహ చికిత్సకు సంబంధించి ఒక కీలక మలుపు అని పేర్కొన్నారు. ఈ విధానం ఇన్సులిన్ చికిత్సకు సంబంధించిన మానసిక, శారీరక అడ్డంకులను తగ్గిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 60 లక్షల మంది ఇన్సులిన్ తీసుకొంటున్నారని, అయితే దానికి కనీసం రెట్టింపు సంఖ్యలో ప్రజలకు ఇది అవసరం కావచ్చని శ్రోత్రియ తెలిపారు. మనం ఆ సంఖ్యను 90 లక్షలకు చేర్చగలిగితే అది భారీగా ఉన్న అవసరాల లోటును తీర్చడంతోపాటు అవిక్లికి వాణిజ్యపరమైన పెద్ద విజయంగా మారుతుందని అన్నారు. నోవో నార్డిస్క్ ప్రస్తుతం దాదాపు 20 రకాల విభిన్న ఇన్సులిన్లను అందిస్తున్నదని, భారత్‌లో ఇన్సులిన్ తీసుకొనే ప్రతి రెండో వ్యక్తి ఈ డెన్మార్క్ కంపెనీ తయారు చేసిన బ్రాండ్‌నే వాడుతున్నారని శ్రోత్రియ తెలిపారు.