ఆదిలాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలో దెయ్యం ఉన్నదని విద్యార్థులు కొంతకాలంగా భయపడుతున్నారు. అమావాస్య రోజు రాత్రి ఒంటరిగా పాఠశాలలో నిద్రించి దెయ్యం లేదని నిరూపించి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు ఉపాధ్యాయుడు రవీందర్రెడ్డి.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనందపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు ఈ నెల 2న ఉపాధ్యాయుడు (జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి) నూతల రవీందర్రెడ్డి బదిలీపై వచ్చారు. ఓ రోజు తరగతి గదిలో పాఠం చెబుతుండగా బయట శబ్దం రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకు భయపడుతున్నారని అడగ్గా బడిలో దెయ్యం ఉంది సార్ అని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న దెయ్యం భయాన్ని తొలగించడానికి ఉపాధ్యాయు డు రవీందర్ శుక్రవారం అమావాస్య రా త్రి ఒంటరిగా పాఠశాలలో పడుకున్నారు.