మహబూబ్ నగర్ కలెక్టరేట్ : ప్రభుత్వ నిబంధనలు, జీవోలు అమలు పర్చి, తప్పుడు మార్గంలో తెచ్చుకున్న, సృష్టించుకున్న పోస్టులను రద్దు చేయాలని (Cancellation) ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నాయకులు (Government Teachers’ Association ) డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. కిషోర్ కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.రమేష్, కె. నాగరాజు మాట్లాడారు.
పట్టణ ప్రాంత పాఠశాలలు పర్యవేక్షించేందుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పోస్టు ఉండగా ఆ పదవిని దాచిపెట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆ పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ కొందరు అధికారుల సహకారంతో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మండల విద్యాధికారి పట్టణ ప్రాంతం (ఎంఈవో అర్బన్) తీసుకురావడం శోచనీయమని ఆరోపించారు.
పంచాయతీరాజ్ సంఘాలు కామన్ సర్వీస్ రూల్స్ పేరుతో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ తమకు దక్కాల్సిన పోస్టులు దక్కకుండా చేస్తున్నారన్నారు. ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్స్, బీఈడీ, డైట్ లెక్చరర్ పదవులలో ప్రభుత్వ ఉపాధ్యాయులే నియామకం కావాలని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నా తమకు అన్యాయమే జరుగుతుందన్నారు.
ఎంఈవో లక్ష్మణ్ సింగ్‌ను మహబూబ్ నగర్ రూరల్ ఎంఈవో గానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు గెస్ట్‌హౌజ్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంఘం ఆర్థిక కార్యదర్శి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులు జే.శ్రీనివాస్, చంద్యా, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి దివాకర్, హరిచందర్ పాల్గొన్నారు.