న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఆనవాళ్లను నిర్ధారించేందుకు ఉపయోగిస్తున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. థర్డ్‌వేవ్ పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఎగుమతి విధానాలను సవరించింది. కొవిడ్- 19 యాంటీజెన్ టెస్ట్ కిట్లను ఎగుమతులపై ఆంక్షల కేటగిరీలో చేర్చుతున్నామని, తక్షణమే ఆదేశాలు అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ) ట్వీట్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాంటిజెన్ కిట్లనే ఎక్కువగా కొవిడ్ పరీక్షల కోసం వినియోగిస్తున్నారు.
ఆర్టీ పీసీఆర్ పరీక్షల కంటే వేగంగా ఫలితాలు వస్తుండడంతో యాంటిజెన్ కిట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం ప్రయోగశాలలు అందుబాటులో లేకపోవడంతో యాంటిజెన్ కిట్లు కీలకంగా మారాయి. రాబోయే రోజుల్లో దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ కిట్ల లభ్యతను పెంచేందుకు కేంద్రం కిట్ల ఎగుమతిని ఆంక్షల జాబితాలో చేర్చింది. ఆంక్షల కేటగిరిలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్టీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.