Gurukul Posts | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : గురుకుల పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడింది. గత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోస్టుల భర్తీని అవరోహణ క్రమంలో కాకుండా ఆరోహణ పద్ధతిలో చేపట్టడంతో వందలాది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఈ విధానంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా, డౌన్మెరిట్ విధానం అమలు చేసి న్యాయం చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. గురుకుల పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ, ఆచరణకు నోచుకోలేదు.
నోటిఫికేషన్ ప్రకారమే పోస్టుల భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చివరకు మాట నిలుపుకోలేదు. మరోవైపు, నోటిఫికేషన్లో పేర్కొన్న 9,210 పోస్టుల్లో దాదాపు 1,800 పోస్టులు మళ్లీ ‘బ్యాక్లాగ్’ రూపంలో మిగిలిపోయాయి. దీంతో సర్కార్ తీరు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) నిబంధనలకు విరుద్ధంగా అనుసరించిన విధానాలను పలువురు గురుకుల అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. ధర్మాసనం కూడా గురుకుల అభ్యర్థులకు అండగా నిలిచింది. డౌన్మెరిట్ పాటించాలని ఆదేశించింది. అయినా సర్కార్ అమలు చేయకుండా ఈ తీర్పును సవాల్ చేసింది.ఇప్పుడు కూడా గురుకుల అభ్యర్థులకే హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇకనైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ పీడీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ మొత్తంగా 9,210 పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించింది. అయితే, కోర్టు కేసుల నేపథ్యంలో మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను మినహాయించి మిగతా పోస్టుల భర్తీ చేపట్టింది. అవరోహణ క్రమంలో అంటే డీఎల్ నుంచి టీజీటీ వరకు పోస్టుల భర్తీని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌తో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న హడావుడి నిర్ణయాలతో అభ్యర్థులను ఆగం చేసింది. డిసెండింగ్ ఆర్డర్‌కు తిలోదకాలిచ్చింది. పీజీటీ, ఆ తరువాత టీజీటీ పోస్టుల భర్తీకి రాత్రికిరాత్రే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, తుది జాబితాలను ప్రకటించింది. 2024 ఫిబ్రవరి, మార్చిలో అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చింది. మొత్తంగా 8,708 పోస్టులకు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసింది. కొన్ని క్యాటగిరీల్లో అర్హులు లేరంటూ 9,210 పోస్టుల్లో 404 పోస్టులను భర్తీ చేయలేదు. ఆ తర్వాత డీఎస్సీ, జూనియర్ అసిస్టెంట్, జేఎల్ పోస్టులను భర్తీ చేయడంతో మరిన్ని ఖాళీ అయ్యాయి. మొత్తంగా 1,800 పోస్టులకుపైగా ఖాళీగా మిగిలిపోవడం గమనార్హం.
ట్రిబ్ అనుసరించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విసుగెత్తిన అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకుండా, ఆరోహణ పద్ధతిలో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా, ఒక అభ్యర్థి మూడు, నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యారని, అందువల్ల 1,800 పోస్టులకుపైగా ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు విన్నవించారు. గతంలో 2017లో విద్యుత్తు సంస్థలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్ల నియామక ప్రక్రియ, 2022లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో వందలాది పోస్టులు మిగిలిన సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. ఒకరు ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఆ పోస్టులో జాయిన్ కాకపోతే, తద్వారా మిగిలిపోయే పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ క్రమంలో ఆయా బోర్డులు మిగిలిన పోస్టులను భర్తీ చేశాయని హైకోర్టుకు వివరించారు. ప్రస్తుతం ట్రిబ్ చేపట్టిన విధానం వల్ల వేలాది పోస్టులు బ్యాక్లాగ్ ఏర్పడటమేగాక, వేలాది మంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని అభ్యర్థులు కోర్టు ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. నాన్ జాయినింగ్ ఉద్యోగాలను తదుపరి మెరిట్లో ఉన్న అభ్యర్థులతో భర్తీ చేయాలని విన్నవించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయిందని వాపోయారు. తుదకు గురుకుల అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురుకుల నియామకాల్లో మిగిలిపోతున్న ఉద్యోగాలన్నింటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే సమయంలో బహుళ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన సమయంలో, అభ్యర్థులు ఒక పోస్టులో చేరితే, ఇతర పోస్టులు ఖాళీ అవ్వడం సహజమని తెలిపింది. జీవో-81 ప్రధానంగా ఒకే నోటిఫికేషన్ నియామక ప్రక్రియ కోసమని, ఒకేసారి అనేక పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి ఆ నిబంధనను వర్తింపజేయడం సరికాదని పేర్కొన్నది. సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించింది.
డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ తదితర వాటికి కామన్ ప్రశ్నపత్రాలు ఇవ్వడం, డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల చాలా పోస్టులు భర్తీకాలేదు. దీనిపై అభ్యర్థులు మొదటి నుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడిపోకుండా ఉండేందుకు డౌన్మెరిట్ను అమలు చేయాలని ధర్నాలకు సైతం దిగారు. ప్రజాప్రతినిధులను సైతం కలిసి గోడు వెల్లబోసుకున్నారు. దీంతో ఆ దిశగా చర్యలు చేపడుతామని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ, ఆ తరువాత ప్రభుత్వం మాట మార్చింది. గురుకుల అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించా రు. ట్రిబ్ సైతం ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అంటూ పలుమార్లు స్పష్టం చేసింది. అదేమంటే, గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌లోని పేరా 5(1)లో జీవో-81 ప్రకారం వెయిటింగ్ లిస్టు విధా నం లేదని, భర్తీ కాని, అభ్యర్థులు జాయినింగ్ కాని ఖాళీలను క్యారిఫార్వర్డ్ చేసి, రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయాలని నిర్ణయించింది.