హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించి పుషరకాలం దాటుతున్నా, ఇకడి ఉన్నతాధికారుల్లో కొందరికి ఇంకా ‘ఆంధ్రప్రదేశ్’ వ్యామోహం వీడనేలేదు. సచివాలయంలో కూర్చొని తెలంగాణ ప్రజల కోసం జారీచేసే అధికారిక ఉత్తర్వులు, మెమోలపై ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని ముద్రిస్తూ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఇంజినీర్లు సైతం కనీస బాధ్యత లేకుండా పాత ఫార్మాట్లను కాపీ-పేస్ట్ చేస్తూ గుడ్డిగా సంతకాలు పెట్టి జారీ చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం దానకిశోర్ సంతకంతో ఈ నెల 6వ తేదీన జారీ అయిన ఓ అధికారిక మెమో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నది. అది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ తదుపరి చర్యలకు సంబంధించిన ఈ మెమో టాప్ లెటర్‌హెడ్‌పై స్పష్టంగా ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని ముద్రించి ఉన్నది. రాష్ట్రంలోని కలెక్టర్లు అందరికీ అత్యంత ప్రాధాన్యమిస్తూ జారీచేసిన ఈ జీవోపై దానకిశోర్ కండ్లు మూసుకొని సంత కం చేశారా? అనే విమర్శలు వస్తున్నాయి. ఈ తప్పు బయటపడటంతో అధికారులు అప్రమత్తమై ఆ తర్వాత సవరణలు చేశారు.
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పేరిట ఏర్పాటైన రాష్ట్రంలో.. అత్యున్నత హోదాల్లో ఉండి నెలకు లక్షలాది రూపాయల జీతాలు తీసుకొంటున్న అధికారులు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిందిస్థాయి సిబ్బంది పాత జీవో ఫార్మాట్లను కాపీ చేసి టైప్ చేసినా, వాటిని పరిశీలించి సరిచేయాల్సిన బాధ్యత స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్ వంటి కీలక అధికారులపై ఉంటుంది. వారు ఏమాత్రం ‘తెలంగాణ సోయి’ లేకుండా, అసలు లెటర్‌హెడ్‌పై ఏమున్నదో కూడా చూసుకోకుండా సంతకాలు పెట్టేయడం వారి బానిస మనస్తత్వానికి నిదర్శనమంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలోనూ ఇదే కాపీపేస్ట్ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ శాఖలో బిల్డింగ్స్ చీఫ్ ఇంజినీర్ జీ రాజేశ్వర్‌రెడ్డి ఈ ఏడాది మే 17న జారీ చేసిన ఓ అధికారిక లేఖలోనూ ఇదే తరహా దారుణం వెలుగుచూసింది. రాజేంద్రనగర్‌లో కొత్త హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ఓ వార్తా కథనంపై ఖండన ఇచ్చేందుకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌కు రాసిన ఈ లేఖపై కూడా ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్’ అనే శీర్షిక దర్శనమిచ్చింది. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో కూర్చొని తెలంగాణ హైకోర్టు భవనం గురించి రాస్తూ.. ఏపీ లేఖ ముద్రను వాడటం అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా నిలిచింది.