హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. ఈమేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని చెప్పారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారని తెలిపారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల అప్పగింతకు అధికారులను కేటాయించామని వెల్లడించారు.