NC 24 | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది ఉన్నారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాండూరు నుంచి తెల్లవారుజామున 4.45 గంటలకు హైదరాబాద్ వైపు బయలుదేరిన ఆర్టీసీ బస్సును, కంకర లోడ్‌తో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ అతివేగంగా ఢీకొట్టింది.
లారీ వేగం అదుపు తప్పడంతో బస్సు కుడి వైపున చీల్చుకుంటూ వెళ్లింది. దాదాపు 15–20 టన్నుల కంకర బస్సులో పడటంతో కుడివైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎడమవైపు కూర్చున్న కొందరు ప్రయాణికులు మాత్రం గాయాలతో బయటపడ్డారు. వారిని పోలీసులు జేసీబీల సాయంతో కంకరను తొలగించి బయటకు తీశారు. గాయపడిన వారిని తొలుత చేవెళ్ల ఆసుపత్రికి తరలించి, పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఈ ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం** కారణమని పోలీసులు గుర్తించారు. అతివేగం వల్లే వాహనం నియంత్రణ తప్పిందని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక నాగ చైతన్య మూవీ బృందం కూడా చనిపోయిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు మూవీ నుండి విడుదల చేస్తామన్న అప్డేట్ని వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు. ఈ రోజు విడుదల చేయాల్సిన పోస్టర్ రేపు విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ సినిమాను సెన్సేషనల్ హిట్ ‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తుండగా, ఈ మూవీత మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్‌గా రూపొందనుంది. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.