హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కల్లుగీత వృత్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గౌడ సమాజానికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజుగౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలికట్టే విజయ్కుమార్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతుల సందర్భంగా కల్లు కాంపౌండ్లను కించపర్చేలా రేవంత్ మాట్లాడటం హేయమని విమర్శించారు. రాజకీయాలకోసం కల్లుగీత వృత్తిని అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు కాంపౌండ్లపై నిర్భందాన్ని విధించిందని, ఇప్పుడిప్పుడే గీతకార్మికులు ఆర్థికంగా బలోపేతం అవుతుంటే రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తిరిగి కల్లుకాంపౌండ్లను మూసివేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.