శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30 : గోపన్పల్లితండాలోని ప్రభుత్వ స్థలంలో భారీగా మట్టిని డంపింగ్ చేయడంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. తమ ఇండ్ల్లకు ముప్పు కలిగించేలా పెద్ద ఎత్తున మట్టిని పోస్తున్నారంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఆందోళనకు దిగారు. నల్లగండ్ల చెరువు పూడికతీత పనుల్లో భాగంగా తీస్తున్న మట్టిని గోపన్‌పల్లి సర్వే నంబర్ 34లోని ప్రభుత్వ స్థలంలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. భారీ టిప్పర్ల ద్వారా రాత్రి వేళల్లో మట్టి డంపింగ్ చేయడంపై స్థ్ధానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే సుమారు 30 అడుగుల ఎత్తువరకు మట్టిని డంపింగ్ చేశారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి కుప్పలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో తమ ఇండ్ల్లకు ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఎత్తుగా ఉన్న మట్టి కిందకి జారడంతోపాటు వర్షపు నీరు ఇండ్ల వైపు మళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి స్థానిక తహసీల్దార్ సహకారం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సర్వే నంబర్ 34లో పెద్దఎత్తున చేసిన మట్టి డంపింగ్‌కు సంబంధించి అధికారిక అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ శాఖ అనుమతి ఇచ్చింది ? అనే విషయాలను అధికారులు బహిర్గతం చేయాలని బాధిత ఇండ్ల్లవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ ఆర్ఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ హైడ్రా అభివృద్ధి పనుల్లో భాగంగా మట్టిని డంపింగ్ చేసేందుకు స్థానిక తహసీల్దార్ గోపన్‌పల్లి సర్వేనెంబర్ 34లో వేయాలని పేర్కొన్నట్లు తెలిపారు.

గ్రామస్తుల ఆందోళన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ స్థానిక మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాగం హరిశంకర్ యాదవ్, శేరిలింగంపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. స్థానిక అధికారుల సహకారం ఉందన్న ఆరోపణలపైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రోజూ రాత్రి పూట వందల టిప్పర్లతో మట్టిని డంపింగ్ చేస్తున్నారు. వర్షం వస్తే మట్టి జారి ఇండ్లపై కూలితే మాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. మట్టి డంపింగ్‌తో ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో రాత్రిళ్లు నిద్ర ఉండడం లేదు. ఇదేంటని అడిగితే ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. మా సమస్యకు ఎవరు పరిష్కారం చూపిస్తారు. నెల రోజులుగా ఎంతో ఆందోళనతో ఉన్నాం. వెంటనే ఈ పని నిలిపివేయాలి. -రేష్మ,బాధిత మహిళ
హైడ్రా పేరు చెప్పి అధికారులు నెలరోజుగా పెద్ద ఎత్తున మట్టిని డంపింగ్ చేస్తున్నారు. నెల రోజులుగా జేసీబీలు, లారీలతో భారీ ఎత్తున మట్టి పోస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంతటి భారీ స్థాయిలో మట్టి ఉంటే వర్షం వస్తే ఇండ్లు మునుగుతాయి. ఏదైనా ప్రమాదం జరిగితే హైడ్రా బాధ్యత వహిస్తుందా? ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పోసిన మట్టిని తొలగించాలి.