దమ్ బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్,
ఉస్మానియా బిస్కెట్, కద్దూ కా ఖీర్.. తదితర బ్రాండ్ హైదరాబాద్ రుచుల సరసన సగర్వంగా నిలబడిన వంటకం.. బాదామ్ కీ జాలీ. ఇదొక తీపి తినుబండారం. అరవై ఏండ్లనాడు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నవాబీ మిఠాయ్. విదేశీ పర్యాటకులకు సైతం నోరూరిస్తున్న ‘బాదామ్ కీ జాలీ’ తయారీ దారుల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్.
సాలార్జంగ్ మ్యూజియం వెనుక.నూర్ఖాన్ బజార్, సుల్తాన్‌పూర్‌లోని ఇంపీరియల్ స్వీట్ హౌజ్‌లో అచ్చమైన ‘బాదామ్ కీ జాలీ’ దొరుకుతుంది. ఈ మిఠాయి దుకాణాన్ని 1960లో ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకొంది.
‘బాదామ్ కీ జాలీ’ని నఫీస్ అనే మహిళ హైదరాబాద్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు ఆమె వయసు ఎనభై ఏడు. నఫీస్ కుటుంబంలోని స్త్రీలు మాత్రమే దీన్ని తయారు చేస్తారు. ప్రస్తుతం నఫీస్ నేతృత్వంలో ఆమె చిన్నకోడలు నస్రీన్ హుస్సేనీ ఆ బాధ్యత తీసు
కున్నారు. ‘ఒకప్పుడు,ఆహార ప్రియులకు మా దుకాణం రుచుల స్వర్గంలా కనిపించేది. చార్మినార్‌ను సందర్శించడానికి వచ్చిన ప్రతి పర్యాటకుడూ బాదామ్ కీ జాలీ రుచి చూడకుండా వెళ్లేవాడు కాదు’ అంటున్నారు నఫీస్.60 ఏండ్ల క్రితం బాదామ్ కీ జాలీ తయారీకి బాదం, జీడిపప్పు, చక్కెర ఉపయోగిస్తారు.
అలనాటి మద్రాస్ స్టేట్‌లో ఈ వంటకం పుట్టింది. అక్కడినుంచి హైదరాబాద్‌కు వచ్చింది. దక్కనీ ఫ్లేవర్స్‌తో సరికొత్తగా ఆహార ప్రియుల మన్ననలను పొందింది. ఈ పరిణామం వెనుక ఓ కుటుంబం పాత్ర ఉంది. సయ్యదా ఐజాజ్ ఫాతిమా తన కుటుంబంతో పాటు దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. వస్తూవస్తూ ఈ వంటకాన్నీ తీసుకొచ్చారు. పరమ రహస్యమైన రెసిపీని తన ముద్దుల కోడలు నఫీస్‌కు చెప్పారామె. కుటుంబ సమావేశాలు, పండుగల సమయంలో ఈ వంటకాన్ని చేసుకునేవారు. మొదట్లో నఫీస్‌కు వ్యాపార ఆలోచన లేదు. ఆత్మీయుల సలహాతో దుకాణం ప్రారంభించారు. సుల్తాన్‌పూర్‌లోని ఇంపీరియల్ స్వీట్హౌజ్ ‘బాదామ్ కీ జాలీ’ చిరునామా. నిర్వహణ ఖర్చులు పెరగడంతో.. కిరాయి డబ్బులు ఆదా చేసేందుకు తమ ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌ను దుకాణంగా మార్చుకున్నారు. మహిళలు తలుచుకుంటే వంటలోనే కాదు, రుచుల వ్యాపారంలోనూరాణిస్తారని ఈ అత్తాకోడళ్లు నిరూపిస్తున్నారు.
‘బాదంపప్పును వేడినీటిలో నానబెట్టి, ఆపైన ఎండబెడతాం. జీడిపప్పు, బాదం
పప్పులను పిండిచేసి, చక్కెర పొడిలో కలిపి మిఠాయిలు తయారుచేస్తాం. వేడిగా ఉన్నప్పుడే అచ్చులతో వివిధ ఆకారాల్లో మలుస్తాం. దీనికి నాలుగైదు గంటల సమయం పడుతుంది’ అని వివరిస్తారు నస్రీన్.