కోటపల్లి, మార్చి 20 : కోటపల్లి మండలం మారుమూల గ్రామమైన నక్కలపల్లికి చెందిన కొత్తూరి సమ్మక్క-లింగయ్య దంపతుల కుమారుడు ప్రణయ్ కాసిపేట గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. పీఈటీ సల్పాల సంతోష్ లాంగ్ జంప్, హైజంప్ విభాగాల్లో శిక్షణ ఇవ్వగా, వాటిలో పట్టు సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించి ప్రత్యేక కోటాలో 2019లో హైదరాబాద్‌లోని షేక్‌పేట గురుకులంలో చేర్పించగా(అడ్మిషన్-పరీక్షలు మాత్రం కాసిపేటలోనే), అక్కడ ఉంటూనే గచ్చిబౌలిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.
ప్రస్తుతం జైపూర్ గురుకులంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రణయ్ రాష్ట్ర, జాతీయ స్థాయి లాంగ్‌జంప్, హైజంప్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తున్నాడు. లాంగ్‌జంప్‌లో 7 మీటర్లకు పైగా, హైజంప్‌లో 2 మీటర్ల పైగా సాధించి రికార్డులు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ క్రీడాకారుడు కూడా వీటిని తిరగరాయలేక పోవడం గమనార్హం. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఏడు పతకాలు సాధించగా, అందులో ఐదు స్వర్ణ పతకాలు, రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఇక రాష్ట్ర స్థాయిలో లెక్కలేనన్ని పతకాలు సాధించినట్లు ప్రణయ్ చెబుతున్నాడు.
హైజంప్, లాంగ్ జంప్ విభాగాల్లో జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయిలో దూసుకుపోతున్న ప్రణయ్‌ని గురుకులాల అధికారులు గోల్డెన్ బాయ్‌గా ఎంపిక చేశారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన ప్రణయ్ మిగతా విద్యార్థులకు ఆదర్శంగా ఉండేందుకు,ప్రణయ్‌ను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్ పుస్తకాలపై మొదటి పేజీల్లో ‘గోల్డెన్ బాయ్’ పేరిట ముద్రించాలని నిర్ణయించారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్న ప్రణయ్ ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఇటీవల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రస్తుత గురుకుల రాష్ట్ర కార్యదర్శి రోనాల్డ్ రాస్ హైదరాబాద్‌లో ప్రణయ్‌ను సత్కరించడం తో పాటు ప్రోత్సాహకంగా రూ.3.5 లక్షల చెక్కును అందజే శారు. కోటపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ బాల్క సుమన్, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో పాటు స్థానిక నాయకులు అభినందించారు.
లాంగ్‌జంప్, హైజంప్ విభాగాల్లో దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడం నా లక్ష్యం. జాతీయ, రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించా. ఇక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని నా కోరిక. హైదరాబాద్ లోని షేక్‌పేట గురుకులంలో ఉంటూ గచ్చిబౌలిలో నాగపురి రమేశ్ ఆధ్వ ర్యంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న. మారుమూల గ్రామంలో పుట్టిన నేను క్రీడల ద్వారా మంచి పేరు సంపాదించుకోవడం చాలా సంతో షంగా ఉంది. జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్త..
– కొత్తూరి ప్రణయ్, జాతీయ క్రీడాకారుడు
మా కొడుకు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. హైజంప్, లాంగ్ జంప్‌లలో ఎన్నో పతకాలు సాధించినందుకు గర్వంగా ఉంది. తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచినందుకు పుస్త కాలపై మావోడి ఫొటో పెట్టడం చూస్తుంటే మా ఆనందం చెప్పలేనిది. మావోన్ని గుర్తించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– సమ్మక్క-లింగయ్య, నక్కలపల్లి, తల్లిదండ్రులు