న్యూఢిల్లీ: కోపెన్‌హగన్ వేదికగా జరిగిన డానిష్ స్విమ్మింగ్ మీట్లో భారత యువ స్విమ్మర్లు సాజన్ ప్రకాశ్, వేదాంత్ మాధవన్ సత్తాచాటారు. శనివారం జరిగిన పురుషుల 200మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌ను 1:59:27సెకన్లలో ముగించిన సాజన్ స్వర్ణ పతకంతో మెరిశాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ హీట్స్‌లో 2:03:67 సెకన్ల టైమింగ్‌తో ప్రకాశ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ప్రదీప్‌కుమార్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న ఈ యువ స్విమ్మర్ ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే పతకం సాధించాడు. మరోవైపు పురుషుల 1500మీటర్ల ఫ్రీైస్టెల్ ఈవెంటులో ప్రముఖ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ రజత పతకం దక్కించుకున్నాడు. 16 ఏండ్ల వేదాంత్ 15:57:86 తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసుకున్నాడు. గతేడాది మార్చిలో జరిగిన లాత్వియా ఓపెన్‌తో పాటు జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో వేదాంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.