సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర పోలీసుల పని తీరు, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో వారు తీసుకుంటున్న చర్యలపై గోవా అసెంబ్లీ బృందం ప్రశంసలు కురిపించింది. సోమవారం గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేష్ పట్నేకర్ నేతృత్వంలో శాసన సభ్యులు బృందం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. స్పీకర్ బృందానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఘన స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రం ఏర్పడిన తరువాత తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ పరమైన సంస్కరణల గురించి సీపీ వివరించారు. గణేష్, శ్రీరామ నవమి, ఈద్, మొహర్రం తదితర పండుగల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, పలు అంశాల గురించి స్పీకర్ బృందం అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా బందోబస్తు చేసే క్రమంలో తీసిన వీడియోలను సీపీ వాళ్లకు చూపిస్తూ, బందోబస్తుకు సంబంధించి వివరించారు.
టెక్నాలజీతో నేరాలను కట్టడి ఎలా చేస్తున్నారనే అంశాలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాలను వివరించారు. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను వీక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారనే అంశాన్ని ట్రాఫిక్ ఈ-చాలన్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు వివరించారు. ఈ సందర్భంగా సీపీ హైదరాబాద్ సిటీ పోలీస్ చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని స్పీకర్‌కు అందించారు. అనంతరం, డీసీపీ(అడ్మిన్) సునీతారెడ్డి హైదరాబాద్ పోలీసులకు సంబంధించిన పలు అంశాలను వచ్చిన బృందానికి వివరించారు. అన్ని అంశాలను తెలుసుకున్న తరువాత హైదరాబాద్ పోలీసు విభాగం పనితీరును అసెంబ్లీ బృందం ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.