హయత్‌నగర్, డిసెంబర్ 6: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో రికార్డులు, ఇతర సామగ్రిని భద్రపరిచే గది వద్ద జరిగిన భారీ పేలుడులో జీఎంఆర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన సూర్యకళ(38) గత కొన్ని రోజులుగా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో జీఎంఆర్ సంస్థ అవుట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్నది. స్టేషన్ ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్ ఆవరణంలోని రికార్డులు భద్రపరిచే రేకుల షెడ్డు వద్ద పేరుకుపోయిన ఎండిన ఆకులు, పాత ఖాళీ సీసాలు, టైర్లు, చెత్తను ఒకచోట వేసి తగులబెట్టింది.
ఈ క్రమంలో చెత్తలోని సీసాలు భారీ శబ్దంతో పగిలిపోయి సూర్యకళ తల, ఎడమ కంటికి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, బాంబు స్వాడ్ బృందం తనిఖీ చేసింది. విషయం తెలుసుకున్న వనస్థలిపురం ఏసీపీ పి.కాశిరెడ్డి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.