మారేడ్‌పల్లి, డిసెంబర్ 23: అపహరణకు గురైన చిన్నారి..క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం…రెజిమెంటల్‌బజార్‌లో శ్రీనివాస్, ఉమా దంపతులు నివాసముంటున్నారు. వీరికి తరుణ్ (6), మూడేండ్ల కీర్తన సంతానం. గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న కీర్తనకు అన్నం పెట్టేందుకు ఉమా కిచన్‌లోకి వెళ్లింది. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూసే సరికి పాప కనిపించలేదు.
చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారి సమీప బంధువు ( మేనమామ) తో పాటు మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్లలో ఉన్న చిన్నారి కీర్తనను రక్షించి.. తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి కిడ్నాప్‌నకు గల కారణాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వెల్లడించారు.