బంజారాహిల్స్,నవంబర్ 23: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ సర్కిల్ -18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలో 20రోజుల పాటు కొనసాగే ఇంటెన్సివ్ పాట్ హోల్స్ డ్రైవ్‌ను చేపట్టింది. ప్రధాన రహదారుల మరమ్మతుల బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలు చూస్తుండగా బస్తీలు, కాలనీల్లో రోడ్ల నిర్వాహణను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం చూస్తోంది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ఏర్పడ్డ గుంతలను గుర్తించడంతో పాటు వాటిని అక్కడికక్కడే పూడ్చేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లతో పాటు బీటీ రోడ్లపై పడ్డ గుంతలను కూడా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పూడుస్తున్నారు. సర్కిల్ 18 పరిధిలోని ఒక్కో డివిజన్‌కు రూ.3.5లక్షల బడ్జెట్‌ను కేటాయించారు. సీసీ రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ఒక బృందం, బీటీ రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. వారంరోజుల క్రితం ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్ మరో రెండువారాల పాటు కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఎప్పటికప్పుడే గుంతలను పూడ్చడమే లక్ష్యం..
రోడ్లపై ఏర్పడ్డ గుంతలను తక్షణమే పూడ్చడం కోసం స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాం. డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పాతబస్తీలోని జీహెచ్ఎంసీ తయారీ కేంద్రం నుంచి బీటీ తీసుకొని వస్తున్నాం. సీసీ రోడ్లపై గుంతల కోసం సిమెంట్ ఇతర సామగ్రిని సిద్ధ్దంగా ఉంచాం. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో ఇసుక, మట్టిని తొలగించి పాట్‌హోల్స్ పూడుస్తున్నాం. దీనివల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. మరోరెండు వారాల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగనుందన్నారు. తమ ప్రాంతాల్లో ఎక్కడైనా గుంతలు ఉంటే స్థానికంగా ఉండే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సమాచారం ఇస్తే వాటిని పూడుస్తున్నామన్నారు.