సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మిఠాయి తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీరాయుళ్లపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. మంగళవారం గ్రేటర్‌వ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 మిఠాయి కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేపట్టగా, నాణ్యత విషయంలో అనుమానం ఉన్న 38 రకాల మిఠాయి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని స్టేట్ ఫుడ్ లేబొరేటరీకి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
రోలెక్స్ కన్ఫెక్షనరీకి షోకాజ్ నోటీసు
కాటేదాన్‌లోని రోలెక్స్ కన్ఫెక్షనరీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆహార భద్రతా ప్రమాణాలు (లేబులింగ్, డిస్ప్లే) పాటించనందుకుగాను సుమారు 25 కిలోల మిఠాయిలను సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెల్లడించారు. పలు దుకాణాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా లోపాలను సరిదిద్దుకోకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు వెల్లడించారు.