
సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): 44 అంశాలపై విస్తృతంగా చర్చించిన స్టాండింగ్ కమిటీ సభ్యులు 40 అంశాలకు ఆమోదం తెలిపారు. ఇందులో ముఖ్యంగా లింకు రోడ్లు, రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. బుధవారం జీహెచ్ఎంసీ స్థాయీసంఘం మూడవ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ప్రతి జోన్లో ఆరు నుంచి ఏడు జంక్షన్లు అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారని.. పారిశుధ్య కార్మికుల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను సభ్యులు కోరారు.
ఈ సందర్భంగా లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ మరో రెండు చోట్ల సీ అండ్ డీ ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లను పిలువనున్నామని అన్నారు. ప్రతి ప్లాంట్ వద్ద ఎలక్ట్రానిక్ వే – బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈసీఐఎల్ నుంచి బోడుప్పల్ వయా ఎన్ఎఫ్సీ వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు.
మోడల్ గ్రేవ్‌యార్డ్ వెనుకభాగంలో ఇరుకుగా ఉన్న రోడ్డును వెడల్పునకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నరికిన చెట్లను వెంటనే తొలగించాలని కోరారు. మరో సభ్యుడు మిర్జా ముస్తఫా బేగ్ మాట్లాడుతూ బాలాపూర్ నుంచి బండ్లగూడ వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డును అభివృద్ధి చేయాలన్నారు. కుర్మ హేమలత మాట్లాడుతూ తన డివిజన్లో మోడల్ గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సీఎన్ రెడ్డి మాట్లాడుతూ యూసుఫ్‌గూడ నుంచి రహమత్‌నగర్ వరకు రోడ్డు వెడల్పునకు ఆస్తుల సేకరణ పూర్తి చేయాలని కోరారు.
షేక్‌పేట్ రషీద్ ఫరాజుద్దీన్ మాట్లాడుతూ షేక్‌పేట్ ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డులో భూసేకరణ నిలిచి పోయినందున అకడ ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. విద్యుత్ శాఖ నరికివేసిన చోట్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని మందాడి స్వామి కోరారు. కేపీహెచ్‌బీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడు స్థానిక కార్పొరేటర్‌ను సంప్రదించాలని.. డివిజన్లో గ్రేవ్‌యార్డ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ చేశారు.
స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, మందగిరి స్వామి, బతా జాబిన్, విజయ్ కుమార్ గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, సి.ఎన్.రెడ్డి, మందడి శ్రీనివాస్ రావు, రావుల శేషగిరిరావు, సామల హేమ, కుర్మ హేమలత, సీసీపీ దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, ఆర్డీపీ సత్తార్, కార్యదర్శి లక్ష్మి, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్, వి.కృష్ణ, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, శ్రీనివాస్‌రెడ్డి, రవికిరణ్, అశోక్ సామ్రాట్, పంకజ, మమత తదితరులు పాల్గొన్నారు.