
సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో జంతు దహన వాటికలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎల్బీనగర్లోని ఫతుల్లగూడ, కూకట్పల్లి జోన్లోని మహదేవ పుర యానిమల్ కేర్ సెంటర్లలో జంతు దహన వాటికల ఏర్పా టుకు జీహెచ్ఎంసీ స్థలాన్ని ఖరారు చేసింది. తొలివిడతగా రెండు చోట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించగా, ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. పీపుల్ ఫర్ యానిమల్స్, రాగ ఫౌండేషన్లకు ఈ బాధ్యతలను అప్పగించారు. దహన వాటికకు సంబంధించిన యంత్రాలు, విద్యుత్ సరఫరా, సిబ్బందిని సమకూర్చుకోవడంతో పాటు నిర్వహణ సదరు సంస్థలదే. పెంపుడు కుక్కలు, పిల్లులు ఇతర జంతువులను ఇక్కడ దహనం చేయనున్నారు. ఇందుకు ఒక్కో జంతువు దహనానికి రూ.2500 చొప్పున నిర్వహణ సంస్థలు చార్జీ చేయనున్నాయి. ఇక వీధికుక్కలు, రోడ్లపై చనిపోయే ఇతర జంతువుల దహనానికి అయ్యే ఖర్చును జీహెచ్ఎంసీ భరించనున్నది. ఈ రెండు చోట్ల త్వరలో జంతు దహన వాటికలను అందుబాటులోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు తెలిపారు.