
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు (పీటీఐఎన్) ఏరివేత లక్ష్యంగా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. పాత ఇంటిని కూల్చి కొత్తది నిర్మించిన పక్షంలో నిబంధనల ప్రకారం మునుపటి పీటీఐఎన్ ఆ నిర్మాణానికి కేటాయించాలి. లేని పక్షంలో ఆ పిటీఐఎన్ను బ్లాక్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలి. కానీ చాలా వరకు పాత నిర్మాణం కూల్చి చేపట్టిన నిర్మాణాలకు కొత్త పీటీఐఎన్ కేటాయిస్తున్నారు. దీంతో పాత నిర్మాణానికి, కొత్త నిర్మాణానికి వేర్వేరు పీటీఐఎన్లు ఉంటున్నాయి. నిర్మాణం లేకపోయినప్పటికీ పీటీఐఎన్ నంబరు ఉండడంతో ఆస్తి పన్ను దీర్ఘకాలిక బకాయి లిస్టు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డబుల్ పీటీఐఎన్లను గుర్తించి బ్లాక్ చేసే దిశగా కసరత్తు చేపట్టారు.
గ్రేటర్లో దశాబ్దాల కాలం నాటి నివాసాలు ఇప్పటికీ ఉన్నాయి. శిథిలావస్థకు చేరినవి కూల్చి వేసి కొందరు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇంకొందరు డెవలప్మెంట్కు ఇస్తున్నారు. కోర్ ఏరియాతో పాటు శివారు సర్కిళ్లలోనూ ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో 17 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు (పీటీఐఎన్) ఉన్నాయి. రెగ్యూలర్గా పన్ను చెల్లిస్తున్న వారు 14 లక్షలు మాత్ర మే. ఐతే 80వేల నుంచి లక్ష వరకు డబు ల్ పీటీఐఎన్లు ఉంటాయని అధికారు లు అంచనా వేసి వాటి గుర్తింపునకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపా రు. అక్కడ పాత భవనం ఉందా? లేదా కూల్చివేసి కొత్తది నిర్మించారా అన్న వివరాలు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా డబుల్ పీటీఐఎన్లను గుర్తించి ఉన్నతాధికారుల ఆమోదంతో బ్లాక్ చేస్తున్నారు. కాగా ఇటీవల డబుల్ పీటీఐఎన్లు 18 చోట్ల గుర్తించి వాటిని బ్లాక్ చేశారు.
పీటీఐఎన్ 1100863690, 1209951133, 1209951134, 1090107440, 1100701467, 1220200070, 1160139570, 1100806610, 1240401151, 1130700397, 1090317357, 1090319389, 1090319390, 1141517454, 1180702293, 1180702294లను బ్లాక్ చేశారు.