‘గని..బాక్సింగ్ బరిలోకి దిగాడంటే ఎంతటి ప్రత్యర్థి అయినా చిత్తు కావాల్సిందే. గుండెలనిండా ఆత్మవిశ్వాసం, లక్ష్య సాధన పట్ల చిత్తశుద్ధి కలిగిన అతని జీవిత ప్రయాణమే మా సినిమా’ అన్నారు కిరణ్ కొర్రపాటి. ఆయన దర్శకత్వంలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మార్చి 18న విడుదల చేయబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘వరుణ్‌తేజ్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుంది.
బాక్సింగ్ నేపథ్యంలో శక్తివంతమైన యాక్షన్ మూవీగా అలరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, సంగీతం: తమన్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.