ఐటీ ఇంజినీర్లు కూడా సినిమాలు తీయొచ్చా?! మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ఆ ఇండస్ట్రీలో ఇమడవచ్చా?! ఆడపిల్లలూ సినిమాలకు స్క్రిప్ట్‌లు తయారు చేసి పేరు తెచ్చుకోవచ్చా?!… ఈ ప్రశ్నలన్నింటికీ… ‘ఓ.. బ్రహ్మాండంగా!!’ అనే సమాధానమే వస్తుంది స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ‘గౌతమి చల్లగుళ్ల’ నుంచి. ఇవన్నీ ఆమె దాటిన మైలు రాళ్లే మరి! సింగీతం శ్రీనివాసరావులాంటి ఉద్ధండులైన దర్శకులతో కలిసి స్క్రిప్టును పండించి, సింగ్‌గీతం సినిమాతో పాటు తన సక్సెస్‌నూ ఆస్వాదిస్తున్న ఆమె.. ‘జిందగీ’తో మాట కలిపింది. ఔత్సాహిక రచయితలకు పనికొచ్చే ఆసక్తికర సంగతులెన్నో పంచుకుంది.
పని చేయడం అంటే నా వరకూ నాకు దాన్ని ఆస్వాదించడమే. అది లేనప్పుడు ఇక నేను ఆ పని చేయలేను. ఆ స్వభావమే నా ప్రయాణాన్ని ఎన్నో మలుపులు తిప్పి ఇక్కడికి తీసుకువచ్చింది. నా అనుభూతుల్ని, అభిప్రాయాన్ని చక్కగా వ్యక్తపరచడానికి రచన అనేది ఒక మంచి దారిలా అనిపిస్తుంది. అందుకే అది నాకు సంతోషాన్నిస్తుంది. బహుశా ప్రవాహంలో ఏ జాతి రాళ్లు ఆ ఒడ్డుకు చేరతాయంటారు కదా… అలా కావచ్చు.
మేం హైదరాబాద్‌లో ఉంటాం. అమ్మ ప్రభావతి, నాన్న బాలకృష్ణ. ఇద్దరూ ఉద్యోగులే. చదువును ఇష్టపడే కుటుంబం. చిన్నప్పుడు నన్నూ అన్నయ్యనూ నాన్న దాదాపు హైదాబాద్‌లోని అన్ని లైబ్రరీలకూ తిప్పేవారు. అలా రకరకాల పుస్తకాలు చదవడం అలవాటైంది. క్లాస్‌లోనూ మంచి మార్కులే వచ్చేవి. ఇంజినీరింగ్ అవ్వగానే టీసీఎస్‌లో ఉద్యోగం కూడా వచ్చింది. దాదాపు అయిదారేళ్లు ఐటీ రంగంలోనే పనిచేశా. ప్రమోషన్లు వచ్చాయి. అమెరికా కూడా వెళ్లాను. కానీ నాకెందుకో అది బోర్‌గా అనిపించింది. అదే పని పదే పదే చేయడమంటే నా వల్ల కాదనిపించింది. మావారితో చెప్పా. నిజానికి ఆయన కూడా ఉద్యోగం మాని మళ్లీ చదువుకోవాలన్న ఆలోచనలో ఉన్నారప్పటికి. చెప్పడం మర్చిపోయా! మాది లవ్ మ్యారేజ్. ఆయన బిట్స్ పిలానీలో చదువుకున్నారు. అమ్మానాన్నలాగే అత్తగారూ వాళ్లు కూడా మంచి సపోర్టివ్ ఫ్యామిలీ. దాంతో పెళ్లయిన అయిదేళ్లకి మళ్లీ చదువన్నా, నా మాటకు సరే అన్నారు. మరి ఉద్యోగం మానేసి నేనేం చేశానంటే…

ఓ పక్క ఐటీ ఉద్యోగం చేస్తున్నా మరో పక్క సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండేది. నా అభిరుచికి మావారి స్నేహితుడి భార్య శ్వేత మంచిరాజు తోడైంది. ఇద్దరం ఆఫీసు అయిపోగానే గబగబా పనిచేసుకుని ఒక మంచి సినిమా చూడటం లేదా ఏదైనా మేమే స్టోరీ అల్లుకుని రాసుకోవడం చేస్తుండేవాళ్లం. ఆనంద్ సినిమా అప్పుడు డైరెక్టర్ శేఖర్ కమ్ములగారు కూడా ఇంజినీరింగ్ చేసి, అమెరికాలో ఎమ్మెస్ చేసి వచ్చారని విన్నా. ఆయన కూడా మనలాగే మధ్యతరగతి కుటుంబం అనీ చదివి ఆశ్చర్యపోయా.
మనలాంటి క్వాలిటీసే ఉన్నాయి కాబట్టి, మనకూ సినిమాల్లో పర్లేదు అనుకునేదాన్ని. ఒకరోజు అనుకోకుండా మా అపార్ట్మెంట్కి షూటింగ్ కోసం శేఖర్ కమ్ముల వచ్చేసరికి నమ్మలేకపోయా. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి నా సినిమా ఆలోచన గురించి చెప్తే ఆయన మెయిల్ ఐడీ ఇచ్చారు. తర్వాత ఆయన్ను కలిశా. నేరుగా సినిమాల్లోకి రావడం కన్నా, దానికి సంబంధించిన చదువు ఉంటే బాగుంటుంది అన్నారు. అలా నేను హెచ్‌సీయూలో కమ్యూనికేషన్ విభాగంలో సీటు తెచ్చుకున్నా. అక్కడే ప్రియదర్శి మా సీనియర్‌గా పరిచయం అయ్యాడు. శేఖర్ కమ్ముల సర్ ద్వారా నాగ అశ్విన్ కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు.
చదువు అయిపోగానే వింగ్స్ అండ్ ఓర్స్ పేరిట స్నేహితులం సొంతంగా మీడియా ఫర్మ్ పెట్టుకున్నాం. వీడియోల ద్వారా పెద్ద పెద్ద ప్రొఫెసర్ల స్పీచ్‌లు పదిమందికీ చేరువ చేయాలన్న తపన అది. అమర్త్యసేన్లాంటి ఆర్థికవేత్తలు, పేరెన్నికగన్న డాక్టర్లు, ప్రొఫెసర్లు.. ఇలా ఎవరైనా బాగా చదువుకున్న వాళ్లు ఎవరివైనా వీడియోలు చేస్తే వాటిని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేలా ఒప్పందం చేసుకునే వాళ్లం. అందుకు మేం కూడా కొంత తక్కువగానే డబ్బు తీసుకునేవాళ్లం. మాకు యూజీసీ వాళ్ల ప్రాజెక్టు కూడా వచ్చింది. పీజీ క్లాసులన్నిటినీ డిజిటలైజ్ చేసే పని. ఇది కూడా దాదాపు అయిదేండ్లు చేశాను. పని రొటీన్‌గా మారేసరికి, ఇక చాలనిపించి మా సంస్థే అయినా నేను బయటికి వచ్చాను. అప్పుడే నా దృష్టి సినిమాల వైపు మళ్లింది.
ఒక మీడియా సంస్థ వెబ్‌సిరీస్‌ల కోసం రచనలు కావాలంటూ 2016లో ప్రకటన ఇస్తే స్క్రిప్టు పంపించా. అది వాళ్లకు బాగా నచ్చింది. ‘పోష్ పోరీస్’ పేరిట అది వెబ్ సిరీస్‌గా రూపుదిద్దుకొంది. రూమ్మేట్స్ అయిన ముగ్గురు ఆడపిల్లల మధ్య జరిగే ఆ కథ మంచి హిట్ అందుకుంది. అలాగే నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసిన మరో ఉమెన్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్‌కు కూడా బాగా పేరొచ్చింది. ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే మరో వెబ్ సిరీస్‌కి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. దానికి డైరెక్షన్ కూడా నేనే చేశాను. టైమ్ ఎన్న బాస్ (తమిళం), జోరుగా హుషారుగా లాంటి సినిమాలకూ పనిచేశా. ఇప్పుడు సింగీతం శ్రీనివాస రావు గారితో పనిచేయడం అన్నది నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారితే ఎంత తేడానో అంత మార్పు తెలుస్తున్నది. ఆయనతో పనిచేసేటప్పుడు ఒక తొంభయ్యేండ్ల మనిషితోనో, పెద్ద డైరెక్టర్‌తోనో ఉన్నాం అని అస్సలు అనిపించదు. ఏ చర్చల్లోనూ ఆయన తన సీనియారిటీని నిరూపించుకోవాలని చూడకపోగా, మా ఆలోచనలను బట్టి మార్పులు కూడా చేస్తుంటారు.
సినిమాలు చేస్తూ మధ్యలో పాపను చూసుకునేందుకు కొంత గ్యాప్ తీసుకున్నా. ఆ సందర్భంలోనే సమాజంలో ఆడవాళ్లను చూసే కోణం అర్థమైంది. నేను పాప ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేదాన్ని. దాంతో తిరిగి స్క్రిప్ట్ పని మీద వెళ్లినప్పుడు నువ్వు ఇంకా పని చేస్తున్నావా అని అడిగిన వాళ్లను, నేను మీటింగుల కోసం అడిగితే అంతగా స్పందించని వాళ్లనూ చూశా. కానీ, ఇదే చోట నన్ను అర్థం చేసుకుని పాప సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చిన వాళ్లూ ఉన్నారు. నా వరకూ నాకు మాత్రం ఆడామగా అనే తేడా చూపించడం నచ్చదు. పాపకు కూడా కిచెన్సెట్, పింక్ బొమ్మల్లాంటివి ప్రత్యేకంగా ఏమీ కొనను. అది చక్కగా కార్లతోనూ, బంతితోనూ ఇష్టంగా ఆడుకుంటుంది.
ఇక, పాత్రల రూపకల్పన విషయంలో మహిళల్ని సహజంగా చూపించడం ఇష్టం. అయితే, చాలాచోట్ల మహిళను తనకంటూ విసుగూ విరామమూ లేని నిలువెత్తు ప్రేమ మూర్తిగా, త్యాగధనురాలిగా చూపిస్తారు, లేదంటే అసలు ఎందుకూ పనికిరాని పరమ విలన్లా చూపిస్తారు. కానీ, మనం రోజు వారీ జీవితంలో చూసే ఆడవాళ్లు నిజానికి అలా ఏం ఉండరు. ఎంత ప్రేమ మూర్తికయినా చిరాకు ఉంటుంది, ఎంత గయ్యాళి అయినా కొన్ని సందర్భాల్లో బాధ్యతగా వ్యవహరిస్తుంది.
తెరపై చూపించే ఆ రెండు పెద్ద గీతల మధ్యనే నిజానికి సాధారణ మహిళల క్యారెక్టర్లు ఉంటాయి. నా కథల్లో అలా వాటిని సహజంగా చూపించడానికి ఇష్టపడతా. ఏ కథలో అయినా నేను అనుకున్న భావన ప్రేక్షకులకూ కనెక్ట్ అయినప్పుడు అందలమెక్కినంత సంతోష పడతా. వెబ్ సిరీస్‌లు రాసేటప్పుడు ప్రేక్షకుడే నా సెన్సార్ బోర్డు అనుకుంటా. ఆ దృష్టిలోనే కథ రాసుకుంటా. ఇక, ప్రస్తుతం మహిళా ప్రధాన పాత్రలో ఉండే ఒక ఫీచర్ ఫిల్మ్‌కు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నా. సింగీతం, కె. విశ్వనాథ్, జంధ్యాల గార్లలాగా ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయే సినిమాలు తీయాలనుంది. అలాంటి ఆలోచన, అవకాశం ఏది వచ్చినా సంతోషంగా ముందుకు వెళతా!
ఇంజినీర్‌గా ఉన్న నేను రచన వైపు వెళ్లడానికి ఒక రకంగా నాయనమ్మ జ్ఞాపకాలే కారణం. ఆమెతో నాది విడదీయలేని అనుబంధం. స్కూల్‌కి వెళ్లొచ్చినా, ఆఫీసుకి వెళ్లొచ్చినా అక్కడి సంగతులన్నీ సరదాగా ఒక కథలాగా చెప్పేదాన్ని. కానీ, ఆమె చనిపోయాక ఆమెను చాలా మిస్ అయ్యా. అందుకే, నాయనమ్మకు నేనేం చెప్పాలి అనుకుంటున్నానో, ఎలా చెప్పాలి అనుకుంటున్నానో అవన్నీ రాయడం అలవాటు చేసుకున్నా. ఒక రకంగా అవే నా తొలి రచనలు. అందులో నా మనసు ఉండేది. అంతే కాదు, ఎవరికైనా ఏమైనా చెప్పాలి అంటే నేను మంచి లెటర్ రాస్తాను. అందులో మన భావాలు చక్కగా అర్థమవుతాయి అనిపిస్తుంది. అప్పట్లోనే ఒక చిన్న కథరాసి నాన్నకు వినిపిస్తే, ఇవి సినిమాగా తీసి చూపించాలమ్మా అన్నారు నాన్న. మరొకసారి నా కథ విని నాన్న ఉద్వేగానికి గురయ్యారు. ఈ రెండూ నాకు గుర్తుండిపోయే సంఘటనలు.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– ఎం.గోపీకృష్ణ