హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలు పక్కనపెట్టి కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. మంత్రులు దేవాదుల ప్రాజెక్టును సందర్శించడం మంచిదేనని, కానీ కరీంనగర్ వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో భాగం కాదా? అని నిలదీశారు. 15 రోజులుగా భేషజాలకు పోకుండా నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల కోసం కాకుండా, తమను నమ్ముకున్న ప్రజలు, రైతుల బాధలు, ఆవేదన చూసి ఈ ప్రెస్‌మీట్ పెట్టినట్టు తెలిపారు. మేడిగడ్డ భూమిపూజ నాటినుంచి తొలిసారి నీళ్లు ఎత్తిపోసినప్పుడు కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, ఈ ప్రాజెక్టుపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పారు. ‘ప్రభుత్వం ఒక అధికారిక బృందాన్ని మేడిగడ్డకు పంపితే మేము కూడా వస్తాం. అకడ మోటర్లు ఆన్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోయినా నీళ్లు ఎత్తిపోయవచ్చు. అన్నారంలో నీళ్లు నింపకుండానే, ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొనిరావచ్చు. మేము చెప్పేది తప్పయితే మమ్మల్ని దోషిగా నిలబెట్టండి’ అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అన్నారం ప్రాజెక్టేమీ కూలిపోదని, ఒకవేళ అకడ ఏదైనా కూలిపోతే తామే బాధ్యత వహిస్తామని హామీ ఇచ్చారు. అన్నారం నుంచి సుందిళ్లకు, అకడ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు.
హుజూరాబాద్ నియోజకవర్గ రైతుల ఆవేదనను చూసి కడుపుమంటతో తాను మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చెప్పారు. రైతులకు బోనస్, భరోసా ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని ఎత్తడం లేదని ఆరోపించారు. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టే అద్భుతమైన కాళేశ్వరం నిర్మించారని, భూదందాలు చేసే రేవంత్‌రెడ్డికి రైతుల కష్టాలు తెలియవని మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు ఏమైనా జరిగితే తమ 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం పూర్తి బాధ్యత వహిస్తామని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకొని రాజీనామా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు.
మానవ రూపంలో ఉన్న ఎల్ నినో రేవంత్‌రెడ్డి అని, ఆయన హిట్లర్, తుగ్లక్ కలయిక అని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద ఎద్దేవా చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలైలో మిడ్ మానేరు డెడ్‌స్టోరేజ్‌కు చేరుకొన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటలు వేసే పరిస్థితి లేదని గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఒ క స్విచ్ ఆన్ చేస్తే కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి కి, మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయనిపేరొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల బృందం హెలికాప్టర్లో వచ్చి మేడిగడ్డ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే, ఇకడి రైతుల కష్టాలు కండ్లకు కడుతాయని హితవు పలికారు. గ పంటలు ఎండిపోతూ, గొంతులు ఎండిపోతున్న తరుణంలోనైనా ప్రభుత్వం స్పందించి, దేవాదులతోపాటు ఎల్లంపల్లిని, కరీంనగర్ రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.